బాన్సువాడ , జనవరి 16 : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు మొనగాళ్లు ఉన్నారని, వీరు హైదరాబాద్‌లో కలిసి ఉంటూ, నియోజకవర్గంలో మాత్రం అనుచరుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చుతారని బీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ విమర్శించారు. బాన్సువాడ ప్రజలపై ప్రేమ ఉంటే సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి రూ.వెయ్యి కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి జరిగేలా పోటీ పడి పనిచేయాలని పరోక్షంగా పోచారం, కాసుల బాల్‌రాజ్, ఏనుగు రవీందర్‌రెడ్డికి సూచించారు. గురువారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.కోట్లాది నిధులు ఇచ్చి పోచారాన్ని గౌరవించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి, కన్న తల్లిలాంటి బీఆర్ఎస్కు ద్రోహం చేశారన్నారు.
బాన్సువాడ జిల్లా ఏర్పాటు ఎటుపాయే!
గతంలో కాసుల బాల్‌రాజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాన్సువాడను జిల్లాగా ఏర్పాటు చేయాలని వందరోజులపాటు ధర్నా చేశాడని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, జిల్లా ఏర్పాటు ఎటుపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోండి
వర్ని యెలమంచలి శ్రీనివాస్, పాత బాలు వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో నియోజక వర్గంలో అవినీతి జరిగిందని యెలమంచలి శ్రీనివాస్ రావు ఆరోపించారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్ర భుత్వం విచారణ చేపట్టి, అవినీతికి పాల్పడిన వా రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుతామన్నారు.
త్వరలోనే గుడ్ మార్నింగ్ బాన్సువాడ/ పల్లెటూరు..
బాన్సువాడ నియోజక వర్గంలో త్వరలోనే గుడ్ మార్నింగ్ బాన్సువాడ, గుడ్ మార్నింగ్ పల్లెటూరు అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని జుబేల్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో ప్రజలను కలిసి ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వివరిస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మోచి గణేశ్, చాకలి సాయిలు, మహేశ్, అఫ్రోజ్, శ్రీకాంత్, మౌలా, సుమేల్, రమేశ్ యాదవ్, శివసూరి, గౌస్, బైరాపూర్ కుమ్మరి దత్తు, బేగరి సాయిలు, బీర్కూర్ మాజీ వార్డు సభ్యుడు మేక రాములు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.