కామారెడ్డి/కంఠేశ్వర్, ఏప్రిల్ 6: ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు పోటెత్తారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడిన కలెక్టర్.. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 154 వినతులు వచ్చాయని తెలిపారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో ఎన్వీ గిరి, జడ్పీ సీఈవో చందర్, అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో 95..
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడూ పరిష్కరించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 95 వినతులు రాగా, వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖలకు రిఫర్ చేశారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, దిలీప్‌కుమార్, సబ్కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.