బిచ్కుంద, జూలై 13: విద్యుత్ లైన్ల కోసం గతంలో ఇనుప స్తంభాలను ఏర్పాటుచేశారు. వాటితో ప్రమాదాలు పొంచి ఉండడంతో క్రమంగా సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ.. ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇనుప స్తంభాలే ఉన్నాయి. వీటి ద్వారా ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలను మార్చి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఆదేశాలు ఇచ్చినా.. క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో అది అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నా యి. బిచ్కుందలోని గాంధీచౌక్ నుంచి కమ్మరి గుడికి వెళ్లే ప్రధాన దారి వెంట స్తంభాలు ఇండ్లకు ఆనుకొని ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వానకాలం ప్రారంభం కావడంతో ఇనుప స్తంభాలను విద్యుత్ సరఫరా అవుతుందని ఆవేదన చెందుతున్నారు. మూగజీవాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని భయపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నిధుల కొరతతో మార్చలేకపోయాం..
గతంలో ఇనుప స్తంభాలు ఉన్న చాలా ప్రదేశాల్లో వాటిని మార్చి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశాం. నిధుల కొరతతో కొన్ని స్తంభాలను మార్చలేకపోయాం. త్వరలో మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇనుప స్తంభాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రమాదాలు జరుగకుండా చూస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి శిథిలావస్థలో ఉన్న సిమెంట్ స్తంభాలను కూడా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తాం.
– కామేశ్వర్రావు,ట్రాన్స్కో డీఈఈ