Bichkunda | బిచ్కుంద, సెప్టెంబర్ 24 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ కార్మికులు పెండింగ్ వేతనాల కోసం గురువారం ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రతీ నెల వేతనాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ప్రశ్నించారు.
పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న తమకు జీతాలుఇవ్వకపోవడం అన్యాయమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రతీ నెల 5వరకు తమ జీవితాలు చెల్లించాలని కోరారు. అలాగే తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తమ ఇబ్బందులపై మున్సిపల్ ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు వెంటనే మంజూరు చేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, సాయిలు, లక్ష్మణ్, శకుంతల తదితరులు పాల్గొన్నారు.