ఎల్లారెడ్డి, జూలై 10 ; స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నెలనెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు సకాలంలో ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూడు నెలలకోసారి వేతనాలు చెల్లించేవారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. పదవీకాలం ముగిసిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఆరు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల తాజామాజీ ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 4న పదవీకాలం ముగియడంతో ఆరు నెలల బకాయిలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు నెలలకోసారి వేతనాలు వచ్చేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తమకు గౌరవ వేతనం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 22 మంది జడ్పీటీసీ సభ్యులు, 22 మంది ఎంపీపీలు, 232 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరు ఎన్నికైన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీడీవోల ద్వారా వేతనాలను పంపిణీ చేసింది.
ఎంపీడీవోల ద్వారా రెండేండ్లపాటు వేతనాలు అందించిన అప్పటి ప్రభుత్వం అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా బ్యాంకుల్లో ఖాతాలు తీయించింది. ప్రజాప్రతినిధులు వేతనాల పంపిణీలో అధికారుల మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల వేతనాల పంపిణీలో జాప్యం చేస్తున్నది. ప్రభుత్వం ఏడు నెలలు గడిచిపోతున్నా వేతనాలు అందించకపోవడంపై తాజా మాజీ ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పదవీకాలం ముగిసే సమయానికి వేతనాలు వస్తాయని ఆశించిన నాయకులకు నిరాశే ఎదురైంది. జిల్లాలోని ఆయా మండలాల్లో నాయకుల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశాల్లో వేతనాలు రాకపోవడంతోపాటు పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అభివృద్ధి పనుల బిల్లులూ రాలే..
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసింది. నూతనంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా తమకు బిల్లులు సకాలంలో వస్తాయి ఆశించిన నాయకులు.. వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడాల్సివస్తుంది. పదవీకాలం ముగియడంతో బిల్లుల కోసం, వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గౌరవ వేతనాలు విడుదల చేయాలి
ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల వేతనాలను వెంటనే విడుదల చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు సంబంధించిన వేతనాలను నేరుగా ఖాతాల్లో వేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలుగా వేతనాలు అందించలేకపోయింది. త్వరలోనే రాష్ట్ర మంత్రిని కలిసి వేతనాలను విడుదల చేయాలని వినతిపత్రం అందిస్తాను.
– ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట
బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం..
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గత డిసెంబర్లో మండల పరిషత్ నిధులతో అభివృద్ధి పనులు చేశాను. పనులు చేసి ఆరు నెలలు గడిచిపోయినా నేటికీ బిల్లులు చేతికి అందలేదు. అంతేకాకుండా ఎంపీటీసీ సభ్యులకు రావాల్సిన వేతనాలు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. మా పదవీకాలం ముగిసినా ఆరు నెలల వేతనాలు రావాల్సి ఉన్నది.
-బోధనపు ఇందిరా, ఎంపీటీసీ సభ్యురాలు శెట్పల్లిసంగారెడ్డి
ప్రభుత్వం మారింది, వేతనం ఆగింది..
గత ప్రభుత్వం మారింది, తమ వేతనం ఆగింది. బీఆర్ఎస్ హయాంలో పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులకు నేరుగా ఖాతాల్లో వేతనం డబ్బులు జమ చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ వేతనాలు నేటి వరకూ ఇవ్వలేదు. వేతనాలు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి.
– రాధాబలరాం, మాజీ ఎంపీపీ, గాంధారి