పొతంగల్, జూన్ 13 : ప్రభుత్వ దవాఖానల్లో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా కాలం చెల్లిన మందులు అంటగట్టిన ఘటన పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన శోభ కూతురు షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. దీంతో ఆమె చక్కెర వ్యాధి నియంత్రించే మందులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మందుల కోసం శోభ ఐదు రోజుల క్రితం పొతంగల్ పీహెచ్సీకి వెళ్లారు.
అక్కడి హెల్త్ సూపర్వైజర్ సాయికుమారి కాలం చెల్లిన మందులతోపాటు రోగానికి సంబంధం లేని మందులు కూడా ఇచ్చారు. ఇది గమనించని శోభ వాటిని తీసుకెళ్లి కూతురికి ఇచ్చారు. విషయం తెలియక మందులు వాడడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎందుకలా జరిగిందో తెలుసుకున్న శోభ గురువారం పీహెచ్సీకి వచ్చి వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఫార్మాసిస్టు అందుబాటులో లేకపోవడంతో మాత్రలు గమనించకుండా ఇచ్చామని హెల్త్ సూపర్వైజర్ సాయికుమారి తెలిపారు. ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు తప్పడం లేదని రోగులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.