Bar Association | వినాయక్ నగర్, ఏప్రిల్, 23 : హిందువులే లక్షంగా పహల్గాంలో నరమేధానికి ఉగ్రవాదులకు దాడులకు పాల్పడ్డారని, దానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలని, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విపత్కర పరిస్థితుల్లో సరిహద్దుల్లోని భద్రతా బలగాలకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత ఉపఖండంలో పాకిస్థాన్ ను ఎకాకిని చేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. బార్ ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు మాట్లాడుతూ దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాన్ని వేదజల్లడానికి పాకిస్థాన్ పన్నిన పన్నాగాన్ని తప్పికొట్టాలని కోరారు. ఈ దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు నిలబడి ప్లే కార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు దిలీల్, ఝాన్సీరాణి, నారాయణ దాసు, శ్రీమాన్, మాజీ పీపీ మధుసూదన్ రావు, పరుచూరి శ్రీధర్, ఎర్రం గణపతి, బిట్ల రవి,పడిగేలా వెంకటేష్,సత్యనారాయణ చౌదరి, జునైద్ అలీ,ఎమ్. ఎ ముబీన్,దయాకర్ గౌడ్, శ్యామ్ బాబు,ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు.