మోర్తాడ్, మార్చి 27: జిల్లాలో ప్యాకేజీ -21 (ఏ) పనులు త్వరగా పూర్తిచేసి రైతాంగానికి సాగునీటిని అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం జీరో అవర్‌లో వేముల మాట్లాడారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాలతోపాటు మెట్పల్లి సెగ్మెంట్లో సుమారు 2లక్షల 12 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు నిర్దేశించిన ప్రాజెక్ట్ ప్యాకేజీ -20, 21, 21ఏ అని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో 70 శాతం పనులు పూర్తిచేశామని, మిగతా పనులు కూడా త్వరగా పూర్తిచేయించాలని కోరారు. ముఖ్యంగా ప్యాకేజీ- 21 (ఏ) మెట్పల్లి సెగ్మెంట్లో 12వేల ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలకు కలిపి 80వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్‌పల్లి మండలంలో 28వేల ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6వేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరించారు.
గత ప్రభుత్వం ఎస్సీరెస్సీ ద్వారా సుమారు 9,274 ఎకరాలకు సాగునీటిని అందించడానికి రూ.150 కోట్లతో చిట్టాపూర్, ఫతేపూర్, సర్బిర్యాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పనులు నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.