డిచ్పల్లి, మే 3: వివాదాలకు కేంద్రంగా మారిన తెలంగాణ యూనివర్సిటీలో మరోమారు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రిజిస్ట్రార్ నియామకం విషయంలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓయూ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్ కొత్త రిజిస్ట్రార్‌గా ఇలా బాధ్యతలు చేపట్టారో లేదో.. అలా ఆమె డిప్యుటేషన్ ఉత్తర్వులు రద్దయ్యాయి. ఇటు రిజిస్ట్రార్ నియామకానికి ఈసీ అనుమతి లేకపోవడం, మహిళా ప్రొఫెసర్ డిప్యుటేషన్‌ను ఓయూ క్యాన్సిల్ చేసిన తరుణంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని వర్సిటీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. తాజా వ్యవహారంపై అటు టీయూ పాలకమండలి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈసీ సమావేశాలకు రాకుండా వీసీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్న తీరును సీరియస్‌గా పరిగణిస్తున్నది.
బాధ్యతల స్వీకరణ..
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) హెచ్వోడీగా పని చేస్తున్న నిర్మలాదేవిని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వీసీ రవీందర్ గుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన నిర్మలాదేవికి 23 ఏండ్ల బోధన అనుభవం ఉన్నది. వీసీతో కలిసి బుధవారం సాయంత్రం టీయూకు వచ్చిన ఆమె రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్మలాదేవి మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, పరిశోధనలకు పెద్దపీట వేస్తామని చెప్పారు.
రాకముందే డిప్యుటేషన్ రద్దు..
అయితే, టీయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టక ముందే నిర్మలాదేవి డిప్యుటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె తక్షణమే ఉస్మానియాలో విధులకు హాజరు కావాలని ఓయూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఓ యూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు, కొత్త రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన వార్త కన్నా.. ఈ డిప్యుటేషన్ రద్దు ఉత్తర్వులే వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నమే ఆమె డిప్యుటేషన్ ఆర్డర్స్‌ను రద్దు చేసినప్పటికీ, ఆ సమాచారం ఆమెకు చేరలేదు. వీసీ రవీందర్‌తో కలిసి సాయంత్రం టీయూకు వచ్చిన నిర్మలాదేవి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఈసీ అనుమతి లేకుండా వీసీ తన మొండితనంతో ఆమెను రిజిస్ట్రార్‌గా నియమించడంపై వర్సిటీలో జోరుగా చర్చ జరుగుతున్నది.
రెండేండ్లలో ఆరుగురు రిజిస్ట్రార్లు..
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండేండ్లలో ఆరుగురు రిజిస్ట్రార్లు మారడం గమనార్హం. రవీందర్ గుప్తా వీసీగా వచ్చిన తర్వాత.. ఈ 23 నెలల్లో ఆరుగురు రిజిస్ట్రార్లను మార్చారు. ఆయన ఇక్కడకు వచ్చిన సమయంలో ప్రొఫెసర్ నసీం రిజిస్ట్రార్‌గా ఉన్నారు. ఈసీ అనుమతి లేకుండానే వీసీ ఆమెను తొలగించి ప్రొఫెసర్ కనకయ్యను నియమించారు. కానీ, ఈసీ ఆదేశాలతో యాదగిరికి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఆయనను పక్కనబెట్టి శివశంకర్‌ను నియమించారు. కొద్దిరోజుల తర్వాత ఆయ న్ను తొలగించి, విద్యావర్ధినికి ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆమె నియామకానికి ఈసీ అనుమతి లేకపోవడంతో విద్యావర్ధిని తప్పుకున్నారు. దీంతో వీసీ తాజాగా నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా నియమించారు. అయితే, డిప్యుటేషన్ రద్దు కావడంతో ఆమె వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. తరచూ రిజిస్ట్రార్ల మార్పుతో తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతున్నది. ఏ ఒక్కరూ పూర్తికాలం రిజిస్ట్రార్‌గా పని చేయకుండానే మారుస్తూ వీసీ కొత్త చరిత్ర సృష్టించారు.
వేతనాలు వచ్చేనా..?
రిజిస్ట్రార్ నియామకంపై గందరగోళం నెలకొనడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ప్రతి నెలా 1, 2వ తేదీల్లో విశ్వవిద్యాలయ సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా ఎవరూ లేకపోవడంతో సిబ్బంది వేతనాలు మం జూరు కాలేదు. పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్ యాదగిరికి హైకోర్టు నుంచి ఉత్తర్వులు రావడంతో ఆయన రిజిస్ట్రార్ చాంబర్‌కు రావడం మానేశారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన నిర్మలాదేవి డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ ఓయూ నిర్ణయం తీసుకోవడంతో ఈ నెల వేతనాలు వస్తాయో లేదోనన్న ఆందోళనలో టీయూ సిబ్బంది ఉన్నారు.
‘వర్సిటీ పరువు తీస్తున్న వీసీ’
టీయూ రిజిస్ట్రార్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన నిర్మలాదేవి.. వర్సిటీ గ్రాంట్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా పాలకమండలి సహించదని ఈసీ సభ్యుడు గంగాధర్‌గౌడ్ స్పష్టం చేశారు. రిజిస్ట్రార్‌గా నిర్మలాదేవీ నియామకానికి పాలకమండలి ఆమోదం లేదని, ఆమె బాధ్యతలు ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. వీసీ రవీందర్ గుప్తా తెలంగాణ విశ్వవిద్యాలయం పరువు తీస్తున్నారని, మొండిగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారమే నిర్మలాదేవికి బాధ్యతలు అప్పగించి, బ్యాంకులో చెక్కులు డ్రా చేసే అధికారం ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నిర్మలాదేవి రిజిస్ట్రార్‌గా వెళ్లవద్దని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశించినప్పటికీ, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి యూనివర్సిటీకి రావడం తగదన్నారు. వీసీ చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారన్నారు. తక్షణమే ఆయన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.