వెట్టిచాకిరి నుంచి బాలలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట తనిఖీలు నిర్వహించి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గత నెల నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో 57 మంది బాలబాలికలకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, పాఠశాలల్లో చేర్పించడంతో పాటు కొంత మందిని వారి సొంత రాష్ర్టాలకు పంపించారు.
-కామారెడ్డి, ఆగస్టు 7
కామారెడ్డి, ఆగస్టు 7 : బంధీగా మారుతున్న బాల్యానికి విముక్తి కల్పించి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఏటా చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలన, బడిబయట పిల్లలు లేకుండా చేయడం, వీధి బాలలు లేకుండా చేయడం, పరిశ్రమల్లో బాల్యాన్ని బంధించకుండా చేయడం, భిక్షాటన చేసే బాలలు లేకుండా చూడడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. దీనిలో భాగంగానే మహిళా, శిశు సంక్షేమ, పోలీసులు, కార్మిక, శిశు సంరక్షణ శాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ కింద జూలై మాసంలో మూడు బృందాలు ఏర్పడి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 57 మంది బాలబాలికలకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు ఇతర రాష్ర్టాల బాలురను వారి ప్రాంతాలకు పంపించారు.
ముస్కాన్-9 పటిష్టంగా అమలు
రాష్ట్ర ప్రభుత్వం బడికి దూరమైన, అనాథ పిల్లలను, బాలకార్మికులను గుర్తించేందుకు ఏడాదికి రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. బాల బాలికలను వెట్టి నుంచి విముక్తి కల్పిచడంతో పాటు వారికి అక్షరజ్ఞానం కల్పించేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలలు, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, మానవ అక్రమ రవాణాకు గురైన చిన్నారుల జాడ కనిపెట్ట్టేందుకు ఏటా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు సత్ఫలితాలునిస్తున్నాయి. ఏటా రెండుసార్లు అన్ని ప్రాంతాల్లో పర్యటించి, తనిఖీలు చేసి పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు గుర్తించి, పునరావాసం కల్పించడంతో పాటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ పేరుతో, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఎవరైనా బాలబాలికలను పనిలో పెట్టుకుటే 1098 టోల్ ఫ్రీకి సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. బాలల సంరక్షణ అధికారుల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించారు.
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 57 మంది బాలబాలికల గుర్తింపు
కామారెడ్డి జిల్లాలో 2023 జూలై ఒకటో తేదీ నుంచి 31వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 57 మందిని గుర్తించారు. జిల్లాలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్లలో ఆయా శాఖల ఆధికారులతో కలిసి మూడు బృందాలతో తనిఖీలు నిర్వహించారు. 57 మంది బాలబాలికలను ఆపరేషన్ ము స్కాన్ ద్వారా గుర్తించగా 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
బాలకార్మికును పనిలో పెట్టుకుంటే కేసులు, జరిమానాలు
దుకాణాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర సంస్థలు, పరిశ్రమల్లో పిల్లలను పనిలో పెట్టుకోకుండా బాల కార్మిక నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే బాలకార్మిక చట్టం కింద యజమానులకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. ఈ దాడుల్లో పట్టుకున్న వారిని పాఠశాలలలో చేర్పించడంతో పాటు వారి తల్లిదండ్రుకు అప్పగించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 సెక్షన్ 57 ప్రకారం కేసులు నమోదు చేశారు.
పిల్లలను పనిలో పెట్టుకోరాదు
పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జరినామాలు విధిస్తాం. వీటితో పాటు జువైనల్ జస్టిస్ యాక్టు కింద చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించాలి. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం, బాల్య వివాహం చేసే వధూవరుల తల్లిదండ్రులపైనే కాకుండా ఇందుకు ప్రోత్సహించిన వారిపైనా కేసులు నమోదు చేస్తాం.
– రమ్య, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారిణి