మోర్తాడ్, అక్టోబర్ 14: సోయా కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారు. కానీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. ఇదేమంటే కేంద్రం ప్రారంభానికే పరిమితమని అధికారులు చెబుతుండడంతో రైతులు బిత్తర పోతున్నారు. అసలేం జరిగిందంటే.. సోయా కొనుగోళ్లు చేస్తామని చెబుతూ ఇటీవల కమ్మర్పల్లిలో కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు.
సోమవారం నుంచి కొనుగోళ్లు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో రైతులు సోమవారం సొసైటీ ఆవరణలో పాస్బుక్ జిరాక్సులను లైన్లో ఉంచారు. మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఒక్కరూ రాలేదు. కనీసం సమాధానం చెప్పే వారు కూడా లేకపోవడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు.
అప్పటికే ఓపిక నశించిన అన్నదాతలు.. ఏం జరిగిందో తెలుసుకుందామని వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకు వెళ్లారు. స్థానికంగా గోదాము సౌకర్యాలు లేనందున కొనుగోళ్లు చేయమని, వేల్పూర్ మార్కెట్ కమిటీ వద్దే కాంటాలు వేస్తామని ఆయన సెలవిచ్చారు. అప్పటికే పూర్తిగా ఓపిక నశించిన రైతులు తీవ్ర అసహానానికి లోనయ్యారు. ఈపాటి దానికి కొనుగోలు కేంద్రం ఎందుకు ప్రారంభించారు.. ఎందుకింత ఆర్భాటం చేశారని మండిపడ్డారు.