మోర్తాడ్, మే 25: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 2,315 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1061.60 అడుగుల (12.07టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయకాలువకు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 321 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 436 క్యూసెక్కుల వరద
బాన్సువాడ / నిజాంసాగర్, మే 25 : ఎండాకాలం ముగియకముందే కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరకు స్వల్ప వరద మొదలైంది. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఆడపదడపా వానలకు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది.
శంకరంపేట్, జోగిపేట్ తదితర ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఆదివారం ప్రాజెక్టులోకి 436 క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు ప్రాజెక్టు ఏఈఈ శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలకు(1405.00 అడుగులు) గాను ప్రస్తుతం 5.706 టీఎంసీల (1393.26 అడుగులు) నీరు నిల్వ ఉన్నదని పేర్కొన్నారు.