Bhodhan Town | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్లో ఇంట్లో చీరల వ్యాపారం చేసే స్వప్న అనే మహిళ వద్దకు మంగళవారం వచ్చిన ఓ మహిళ చోరీకి యత్నించింది. సినిమా ఫక్కీలో బురఖా ధరించిన ఓ మహిళ.. చీరల వ్యాపారి స్వప్న ఇంటికి వచ్చి తనకు చీరలు కావాలంటూ నచ్చిన చీరలు ఎంపిక చేసుకున్నది.
ఎంపిక చేసుకున్న చీరలను స్వప్న ప్యాక్ చేసే క్రమంలో, బురఖా ధరించిన మహిళ తన వెంట తెచ్చుకున్న కారంపొడిని స్వప్న కళ్ళల్లో చల్లి.. తన వెంట తెచ్చిన చిన్న కత్తితో బెదిరించింది. కౌంటర్లో ఉన్న సుమారు రూ.40 వేల నగదు తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో స్వప్న కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సదరు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చోరీకి యత్నించిన మహిళ పేరు శోభ అని ఆమె బోధన్ వాసి అని పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ తెలిపారు.