ఎల్లారెడ్డి, జూన్ 15: కుటుంబ తగాదాలతో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. ఆస్తి కోసం సొంత కుటుంబీకులే హత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సాతెల్లికి చెందిన కుర్మ దుర్గయ్య (35)కు అదే గ్రామానికి చెందిన లక్ష్మితో కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, దంపతుల మధ్య తరచూ తగాదాలు జరుగుతుండడంతో పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. చాలా రోజుల నుంచి భార్యాభర్తలు విడివిడిగానే ఉంటున్నారు. పెద్దల సూచన మేరకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలోనుంచి ఎకరం కుమారుడికి ఇవ్వాలని చెప్పగా, దుర్గయ్య సరే అన్నాడు. అయితే, ఉన్న నాలుగు ఎకరాలు భార్య ఆధీనంలోకి తీసుకుని సాగు చేసుకుంటున్నది. తనకు భూమి లేకపోతే ఎలా బతికేదని భావించిన దుర్గయ్య మూడు రోజుల క్రితం పొలం వద్దకు వెళ్లి ఎకరం భూమిని దున్నాడు.
శనివారం ఉదయం మరోమారు పొలం వద్దకు వెళ్లగా, భార్య లక్ష్మి, కుమారుడితో పాటు మామ సాయిలు గొడవకు దిగారు. ముగ్గురు కలిసి అతడ్ని తీవ్రంగా చితకబాదారు. అనంతరం అతడ్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పడేసి గడియ పెట్టి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు 100, 108కు కాల్ చేసి సమాచారమిచ్చారు. దీంతో 108 సిబ్బంది వచ్చి దుర్గయ్యను ఎల్లారెడ్డి దవాఖానకు తరలించగా, పరిశీలించిన వైద్యులు కామారెడ్డి దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. పరిస్థితి విషమించడంతో కామారెడ్డికి వెళ్లేలోపే అతడు మృతి చెందాడు. భార్య లక్ష్మి, కుమారుడు, మామ కుర్మ సాయిలు కొట్టడంతోనే తన తమ్ముడు మృతి చెందాడని దుర్గయ్య సోదరుడు కాశయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.