నిజాంసాగర్, సెప్టెంబర్ 16: మండలంలోని నిజాంసాగర్-అచ్చంపేట రహదారి మధ్యలో ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద ఓ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం పాత వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్(35) మంగళవారం తన అత్తగారి ఊరైన అచ్చంపేటకు మోపెడ్‌పై బయల్దేరాడు. నిజాంసాగర్ నుంచి నీటి విడుదల చేపట్టడంతో అచ్చంపేట శివారులోని నాగమడుగులో లెవల్ వంతెన వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నిజాంసాగర్ వైపు తన వాహనాన్ని నిలిపి అత్తారింటికి నడుచుకుంటూ వెళ్లాడు.
తిరుగు ప్రయాణంలో తన వెంట మరో వ్యక్తిని తోడు తీసుకొని వచ్చాడు. అచ్చంపేట అవతలి ఒడ్డు నిజాంసాగర్ వైపు ఉన్న తన మోపెడ్‌ను తీసుకొని రావడానికి దుస్తులు విప్పి వెంట వచ్చిన వ్యక్తికి అప్పగించి ప్రవీణ్ నీటిలో దిగాడు. అవతలి ఒడ్డుకు చేరుకునే క్రమంలో వరద ఉధృతికి నీటిలో గల్లంతయ్యాడు. ఎస్సై శివకుమార్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు మమ్మరం చేశారు. నీటిలో గల్లంతైన ప్రవీణ్‌కు భార్య సునీత, కూతురు ఆవంతి(9), కుమారుడు నిశాంత్(7) ఉన్నారు.
నాలుగు రోజల క్రితమే ప్రస్తావించిన ‘నమస్తే తెలంగాణ’
నాగమడుగు లో లెవల్ వంతెనపై ప్రయాణం ప్రమాదభరితంగా మారిందని నమస్తే తెలంగాణ దినపత్రికలో నాలుగు రోజుల క్రితం ‘అమ్మో.. ఆ వంతెనలపై ప్రయాణమా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇంతలో ఓ వ్యక్తి నాగమడుగు లో లెవల్ వంతన వద్ద గల్లంతయ్యాడు. నిజాంసాగర్ నుంచి అచ్చంపేట, నవోదయ, ఆదర్శ పాఠశాల, మర్పల్లి, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి, లింగంపల్లి గ్రామాలకు వెళ్లడం భారంగా మారింది.నిజాంసాగర్ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో నిజాంసాగర్ వద్ద చిన్నపూల్ వంతెన, నాగమడుగు వద్ద లో లెవల్ వంతెనలు ప్రమాదకరంగా మారడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.