బిచ్కుంద, సెప్టెంబర్ 29: బిచ్కుంద మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు నగలు దోచుకునేందుకు వచ్చిన దుండగుడు హత్యచేసి పారిపోయాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించి సీఐ జగడం నరేశ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుందలోని ఎస్సీవాడలో గోనె కాశవ్వ (65) తన కొడుకు, కోడలుతో కలిసి ఉంటున్నది.
ఆదివారం కొడుకు, కోడలు వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. కాశవ్వ ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఓ గుర్తు తెలియని దుండగుడు .. ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లను తెంపివేశాడు. ఈ క్రమం లో దుండగుడిని అడ్డుకోవడానికి వృద్ధురాలు యత్నించగా..ఒక్కసారిగా ఆమె తలను గోడకేసి బాదాడు. దీంతో కాశవ్వ అక్కడికక్కడే మృతి చెందింది.
కాసేపటికి ఇంటి ఎదురుగా ఉన్న భూదవ్వ పలుకరించడానికి రాగా.. కాశవ్వ రక్తపు మడుగులో పడి ఉండడం గమనించి వెంటనే స్థానికులకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాన్సువాడ డీఎస్పీ సత్యనా రాయణ, బిచ్కుం ద సీఐ జగడం నరేశ్, ఎస్సై మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.