ఖలీల్‌వాడి/కామారెడ్డి, ఫిబ్రవరి 27: ఇంటర్ పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 9 వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్ణీత సమయంలోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షాకేంద్రాలను గుర్తించేందుకు సెంటర్ లొకేటర్ యాప్ రూపొందించారు. హాల్‌టికెట్‌ను నమోదు చేస్తే విద్యార్థి ఉన్న ప్రదేశం నుంచి పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉంది, అక్కడకు ఎలా చేరుకోవాలనేది ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. మరోవైపు, ఫీజులు చెల్లించని విద్యార్థులకు కొన్ని ప్రైవేట్ కళాశాలలు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదన్న విమర్శలపై విద్యాశాఖ స్పందించింది. విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. వాటిపై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 57 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 35,346 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇక, కామారెడ్డి జిల్లాలో 19,509 మంది విద్యార్థుల కోసం 37 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటల కల్లా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని నిజామాబాద్ డీఐఈవో రఘురాజ్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్ నివారణకు మూడు సిట్టింగ్ స్కాడ్ బృందాలు, మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని సూచించారు. పరీక్ష రాసే సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావొద్దని, బాగా చదివి ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలన్నారు.మార్చి 16 వరకు జరగబోయే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఉదయం 8.15 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు 55 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 10 మంది అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లు, ఐదుగురు కస్టోడియన్స్‌ను నియమించినట్లు వివరించారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటరులు మూసివేయాలని సూచించారు.