పెద్ద కొడప్గల్, డిసెంబర్ 20: పెద్ద కొడప్గల్ ఎస్సీ బాలుర వసతిగృహంలో గురువారం ఉడికీ ఉడకని అన్నం తినడంతో నలుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ నెల 20న ‘వసతిగృహంలో రుచిలేని భోజనం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. శుక్రవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి రజిత హాస్టల్‌ను సందర్శించి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..వసతిగృహం లో ఉడికీ ఉడకని అన్నం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవగా.. విచారణ చేపట్టినట్లు తెలిపారు. కొత్త బియ్యం కావడం, వంట నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. బియ్యాన్ని బిచ్కుంద ఎంఎల్ఎస్ పాయింట్‌కు మార్చినట్లు తెలిపారు. దవాఖానలో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. నివేదిక అందించడంలో నిర్లక్ష్యం వహించిన వార్డెన్ రాజేందర్‌పై చర్యలు తీసుకొని, వేరే హాస్టల్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.
వంట నిర్వాహకులను తొలగించి, కొత్త వారిని తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం, రుచి చూసిన తర్వాతే అందించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధికారిణి వెంట ప్రత్యేకాధికారి కిషన్, తహసీల్దార్ దశరథ్, ఎస్సై మహేందర్, అధికారులు ఉన్నారు.