చందూర్ మండలంలో రైతులు యాసంగి సాగులో భాగంగా పోసిన వరి నారు సిద్ధమవుతున్నది. మరో వారంలో నాట్లు వేయనున్నట్లు రైతులు చెబుతున్నారు.
-చందూర్, డిసెంబర్ 12
ఇందల్వాయి, డిసెంబర్ 12: యాసంగి సాగుకు వరి రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనం ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఈసారి హైబ్రిడ్ వరి సాగు పెరిగే అవకాశం ఉన్నది. దీంతో విత్తన కంపెనీల ప్రతినిధులు ఉమ్మడి జిల్లాలో పాగా వేశారు. నార్లు పోయాలని కంపెనీలు ఇప్పటికే ఆయా గ్రామాల్లోని ఆర్గనైజర్లకు సూచించారు. అయితే కంపెనీలు పంట ఉత్పత్తిని తీసుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఏటా డీలర్లకు, రైతులకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పంట వేసే ముందు ఒకమాట, దిగుబడి వచ్చిన తర్వాత మరోమాట మారుస్తూ.. రైతులకు లక్షల రూపాయల్లో శఠగోపం పెడతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే విత్తన ఎంపికలోనే రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
రైతులు పాటించాల్సినవి…
విత్తనం తీసుకునే ముందు విధిగా వ్యవసాయ కార్యాలయంలో సమాచారం అందించాలి. వారు ఇవ్వకుంటే రైతులే తీసుకోవాలి. విత్తనం తీసుకునేటప్పుడు కంపెనీకి గుర్తింపు ఉందా లేదా చూసుకోవాలి. నేరుగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేసే కంపెనీలను ఎంచుకుంటే మంచిది. ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాన్ని మాత్రమే ఎంచుకోవాలి. కంపెనీలు నమ్మబలికినా మీకు నచ్చితేనే సాగు చేయాలి. కంపెనీలు ఇచ్చే విత్తన వివరాలను, రశీదులను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.
విత్తన గుణగణాలను, వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి సామర్థ్యం మేరకు విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. కంపెనీలతో లిఖిత పూర్వకంగా ఏర్పర్చుకున్న ఒప్పంద పత్రాన్ని భద్రపర్చుకోవాలి. డీలర్లు ఆయా ప్రాంతాలకు అనువైన విత్తనాలను మాత్రమే రైతులకు అందించాలి. కొందరు రైతులు, డీలర్లతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అయితే కంపెనీలతో చేసుకుంటే మంచిది.
నష్టపోయిన తర్వాత వస్తున్నారు..
బై బ్యాక్ విధానంలో వరి సాగు చేసే రైతులు.. కంపెనీలతో ఒప్పందపత్రం రాసుకోవాలి. ఎక్కువ మంది రైతులు ఎలాంటి పత్రాలు లేకుండానే సాగుచేసి కంపెనీలు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మా వద్దకు వస్తున్నారు. ముఖ్యంగా రైతుల పేర్లు కంపెనీల్లో నమోదు అయ్యాయో లేదో చూసుకోవాలి. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే కంపెనీలను ఎంచుకుంటే మంచిది.
– ప్రవీణ్, ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి, ఇందల్వాయి