Anger | మారిన జీవన విధానం కారణంగా చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కోపానికి గురవుతున్నారు. ఇలా తరచూ కోపం రావడం వల్ల రక్తనాళాలు ప్రభావితం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం 8 నిమిషాల పాటు కోప్పడడం వల్ల రక్తనాళాలు విస్తరించే అవకాశం సగానికి తగ్గుతుందని అలాగే ఈ ప్రభావం 40 నిమిషాల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోపం తీవ్రత గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యవంతమైన రక్తనాళాలు సజావుగా వెడల్పు అవుతాయి. కోపం కారణంగా అవి గట్టిపడినప్పుడు గుండె రక్తాన్ని నెట్టడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. మొత్తం హృదయనాళ వ్యవస్థపై ఇది ఒత్తిడిని చూపిస్తుంది. కాలక్రమేణా అధిక రక్తపోటు, ధమనులకు నష్టం కలగడం, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కోపం కారణంగా అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి రక్తనాళాలు బిగుసుకుపోయేలా చేయడంతో పాటు రక్తపోటును పెంచుతాయి. హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది.
అలాగే కోపం ఒకేసారి ఎక్కువ హానిని కలిగించకపోవచ్చని కానీ తరచూ కోపం రావడం వల్ల గుండెకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక ఈ కోపానికి రోజువారి అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు తోడైతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. లోతుగా శ్వాస తీసుకోవడం, శారీరక వ్యాయామాలు చేయడం, ధ్యానం వంటివి చేయాలి.
కోపం రావడానికి గల కారణాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే 1 నుండి 10 వరకు అంకెలు లెక్కపెట్టడం లేదా సంగీతాన్ని వినడం వంటివి చేయాలి. అలాగే తగినంత నిద్రపోవడం వల్ల కూడా కోపం తక్కువగా వస్తుంది. ఇక కోపాన్ని నియంత్రించుకోలేని వారు థెరపిస్ట్ ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. కోపం కారణంగా ఒత్తిడి హార్మోన్లు పెరగడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది కనుక కోపాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.