పెద్ద కొడప్గల్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన ప్రజావాణి (Prajavani) అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారి పోతున్నాయి. ప్రభుత్వం ప్రతి సోమవారం తహసీల్ కార్యాలయాల్లో ప్రజావాణిని నిర్వహిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతుంది.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ ( Pedda Kodapgal ) మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ దశరథ్, మండల పరిషత్ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి తప్ప మిగతా శాఖల అధికారులు హాజరు కాలేదు. వ్యవసాయం, ఆరోగ్యం, నీటిపారుదల, విద్య( Education) , రోడ్లు , భవనాలు, పంచాయతీరాజ్( Panchayatraj) , శిశు సంక్షేమం ,పశువైద్యం, విద్యుత్, ఐకేపీ, ఐసీడీఎస్ , మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరయ్యారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అర్జీదారులు ఆరోపించారు. మండలంలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు రాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లి ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు అందజేస్తున్నట్లు అర్జీదారులు వాపోయారు. ప్రజావాణికి డుమ్మా కొడుతున్న అధికారులపై చర్యలు లేకపోవడం వల్లనే అధికారులు ప్రజావాణిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.