Home Guards | వినాయక్‌నగర్, నవంబర్ 1 : హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హోంగార్డ్ అసోసియేషన్ బాధ్యులు నేడు (శనివారం) ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హోంగార్డులు వెళ్లకుండా చూడాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.
దీంతో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 450 మంది హోంగార్డులను శుక్రవారం సాయంత్రం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు రావాల్సిందిగా సంబంధిత అధికారులు సూచనలు చేశారు. దీంతో ఉన్నఫలంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ డివిజన్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులు సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సుమారు 3 గంటల పాటు హోంగార్డులు అక్కడే ఉండిపోయారు.
చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఎవరూ వెళ్లవద్దని, ‘మీరు కేవలం సేవ చేసేందుకే వచ్చారని, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదని’ సంబంధిత అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించి హైదరాబాద్‌కు వెళ్తే ఈ తాత్కాలిక ఉద్యోగం కూడా ఊడుతుందని హెచ్చరించినట్లు హోంగార్డులు స్వయంగా తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న హోంగార్డుల హాజరు తీసుకొని, సంతకాలు సేకరించినట్లు తెలిసింది. శనివారం ఉదయం 5 గంటలకే హోంగార్డులందరూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
నేడు హోంగార్డుల చలో హైదరాబాద్
తమ సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నేడు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సన్నద్ధమయ్యారు. ప్రతిపక్షంలో ఉండగా తమకు అనేక హామీలిచ్చి ఊరించిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక వినతి పత్రాలు కూడా తీసుకునేందుకు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఇతర ఉద్యోగ సంఘాలతో పాటు హోంగార్డులను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలిచి చర్చించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆందోళనలపై ఆంక్షలు ఉన్నా వెనక్కి తగ్గేది లేదని, శాంతియుతంగానే నిరసన తెలుపుతామని స్పష్టంచేశారు.