కామారెడ్డి, అక్టోబర్ 16 : ఎన్నికల విధుల్లో నియమించిన అధికారులందరూ కలిసికట్టుగా ఆర్మీలా పని చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్ నుంచి రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులందరూ తమకు అప్పగించిన పనులను సమర్దవంతంగా నిర్వహిస్తామనే పూర్తి విశ్వాసంతో పనిచేయాలని చెప్పారు.
ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు తొలగింపులకు సంబంధించి వచ్చిన ఫారం 7, 8లను ఈ నెల 19లోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో 51 వేల నూతన ఓటరు ఎపిక్ కార్డుల పోస్టల్ శాఖ ద్వారా జరుగుతున్న పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు. చెక్ పోస్టులపై నిఘా ఉంచాలని, అనుమానాస్పదంగా డబ్బు, మద్యం, కానుకలు తదితర వాటిని రవాణా చేస్తే స్వాధీనం చేసుకోవాలని అన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఉల్లంఘనలు ఎక్కువగా జరిగే అవకాశముంటుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు.
తహసీల్దార్లు, సెక్టోరియల్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైట్ మ్యాప్ ఆధారంగా అన్ని పోలింగ్ బూత్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి మౌలిక వసతులున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు మను చౌదరి, ప్రభాకర్, శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, కలెక్టర్ ఏవో మసూర్ అహ్మద్, ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.