ఖలీల్‌వాడి/నందిపేట, జూన్ 10 : రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే ఎలాంటి లోపాలు లేని కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతూ ఆయనకు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్‌కు ఇన్ని వేధింపులా ? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని తెలంగాణ ప్రజలు బ్లాక్‌డేగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమనేత, అభివృద్ధి సంక్షేమ ప్రదాత కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరైనా మట్టి కొట్టుకుపోతారని హెచ్చరించారు. గద్దెనెక్కిన తొలిరోజు నుంచే కక్ష సాధింపుల పర్వానికి తెరలేపిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని పేర్కొన్నారు.
తనవి బీజేపీ, టీడీపీ మూ లాలని రేవంత్‌రెడ్డే స్వయంగా చెప్పుకున్నారని, ఆయన చదివిన మోదీ, చంద్రబాబు స్కూళ్లకు చీటింగ్ తప్ప రేటింగ్ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలని తొడగొట్టిన మొనగాడు అని, కేసీఆర్ అనే మేరు పర్వతాన్నే ఢీకొట్టే దమ్ముందా ? అని మండిపడ్డారు. హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ కుటిలత్వంపై తెలంగాణ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కేసులు, విచారణకు భయపడబోమని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసేవరకు పోరాడుతామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.