వందశాతం మార్కులు సాధించేందుకు ప్రాక్టికల్ పరీక్షలు దోహదపడతాయి. అంత ప్రాధాన్యమున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు క్షేత్రస్థాయిలో భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. ఆధునికతను అందిపుచ్చుకొని ముందుకుసాగాల్సిన ఈ రోజుల్లో పాత పద్ధతిలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ మమ అనిపించుస్తున్నారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగ పరీక్షలను అధికారులు నామమాత్రంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వం జంబ్లిం గ్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని అమలు చేయకపోగా, పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. అధికారులు కూడా మొక్కుబడిగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు కళాశాలల్లో ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు సరిగ్గా లేకున్నా తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో… ప్రయోగ పరీక్షల్లో సాధించే మార్కులు కూడా అంతే కీలకంగా మారుతాయి. అందుకోసం విద్యార్థులు ముందు నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. కానీ కొన్ని కళాశాలల్లో ప్రయోగ పాఠాలు నిర్వహించకుండా, విద్యార్థులను ముందస్తుగా సంసిద్ధులను చేయకుండానే ప్రాక్టికల్స్ నిర్వహించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు మంచి మార్కులు వస్తాయో.. రావో అని బాధపడుతున్నారు.
పొరపాట్లు లేకుండా చూస్తున్నాం
జిల్లాలో ఎక్కడా పొరపాటు లేకుండా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది పాత పద్ధతినే కొనసాగిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-షేక్ సలాం, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి, కామారెడ్డి