రామారెడ్డి, ఏప్రిల్ 1: రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డిపై సోమవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఎంపీపీపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు గత ఫిబ్రవరి 9న అవిశ్వాసం ప్రకటించి, తీర్మానకాపీని ఆర్డీవో రంగనాథ్రావుకు అందజేశారు. దీంతో ఎంపీపీ హైకోర్టును ఆశ్రయించి ఫిబ్రవరి 16వ తేదీన స్టే తెచ్చుకొన్నారు. మార్చి 14న స్టే ముగియడంతో ఎంపీపీపై మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో రంగనాథ్రావు ఆధ్వర్యంలో సోమవారం అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 10 మంది ఎంపీటీసీలకు అందరూ గైర్హాజరయ్యారు. ఉదయం 11 గంటలు దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో ఎంపీపీపై అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. సమావేశంలో తహసీల్దార్ రోజా, ఎంపీడీవో సవితారెడ్డి,అధికారులు పాల్గొన్నారు.
ఎంపీపీపై అవిశ్వాసం వీగిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకొన్నారు. నారెడ్డి దశరథ్రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.