నిజామాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిజామాబాద్ క్రైం : విజయవాడలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ నగరానికి చెందిన పప్పుల సురేశ్ ఉదంతంలో విషాదకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రైవే టు ఫైనాన్షియర్ల నిలువు దోపిడీ మూలంగానే బాధిత కుటుంబం బలైనట్లు స్పష్టం అవుతున్నది. అప్పుగా తీసుకున్న డబ్బులకు వ డ్డీల మీద వడ్డీలు చెల్లించినప్పటికీ బాకీలు మాత్రం తీరకపోవడం తో చివరకు ప్రాణాలు తీసుకోవాల్సివచ్చింది. లక్షకు 20 నుంచి 30శాతం చొప్పున కమీషన్ వసూలు చేస్తూ ఫైనాన్షియర్లు చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. వడ్డీ వ్యాపారుల చేతి లో తమ కుటుంబం ఏ విధంగా చిత్రహింసలకు గురైందో వివరిస్తూ చనిపోవడానికి కొన్ని నిముషాల ముందు తీసిన సెల్ఫీ వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఇందులో గణే శ్ అనే బీజేపీ నాయకుడు సైతం ఉన్నాడు. చనిపోయిన పప్పుల సురేశ్ ప్రత్యేకంగా బీజేపీ నాయకుడి పేరును ప్రస్తావిస్తూ 1.5 నిమిషాల సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. తమ చావుకు కారణమైన బీజేపీ నాయకుడిని కఠినంగా శిక్షించాలంటూ సురేశ్ ప్రాధేయపడుతూ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచి వేస్తున్నాయి.
బంక్‌లో రూ.18 లక్షలు ఉన్నాయి..
‘మామ… బంక్‌లో రూ.18లక్షలు ఉన్నాయి. అవన్నీ మనవే. వా ళ్లు(ఫైనాన్షియర్లు) చెబుతున్నట్లుగా వాళ్లవి కావు. ఒక్క పైసా ఇవ్వ కు. అది నువ్వే సెటిల్మెంట్ చేయు. కానీ మా చావుకు కారణమై న వాళ్లను వదలకు. అమ్మ, తమ్ముడు ఇద్దరు సత్రంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మ చనిపోయింది. తమ్ముడు కొన ఊపిరితో ఉన్నాడు. నేను, నాన్న కృష్ణా నదిలో చనిపోతున్నాం మామ. మీరు వచ్చి మా శవాలు తీసుకుపోండి. కానీ మా చావుకు కారణమైన వాళ్లను వదలొద్దు’ అంటూ పప్పుల సురేశ్ పెద్ద కుమారుడి వాయిస్ మెస్సేజ్ గుండెలను పిండేస్తున్నది. బకాసురులుగా మారిన పైనాన్షియర్లు అమాయక కుటుంబంపై పడి ఎంతగా పీల్చి పిప్పి చేశారనడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఓ వైపు మెడికల్ షాపు వ్యాపారం, మరోవైపు పెట్రోల్ బంకు నిర్వహణతో లా భాలు సాధిస్తున్న సురేశ్ మెల్లిగా దారిలో పడుతున్న క్రమంలోనే ఇదంతా జరిగింది. అప్పులు కట్టుకుంటూనే… ఫ్యామిలీని కష్టాల నుంచి బయటికి తీసుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు రాక్ష స వడ్డీ వ్యాపారుల రూపంలో బ్రే క్ పడడంతో కుటుంబం బలైంది. వడ్డీలు చెల్లించినప్పటికీ వదలకుం డా కిరాయి రౌడీలను ఇంటికి పం పించి దాడులకు ఉసిగొల్పడం, పరువు తీసేలా చర్యలకు పాల్పడడంతో చేసేది లేక ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు సురేశ్ కుటుంబం చనిపోవడానికి ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోల ద్వారా అర్థం అవుతున్నది.
నోరు విప్పని కమలం పార్టీ…
అమాయక కుటుంబాన్ని బలి తీసుకున్న బీజేపీ నాయకుడు గణేశ్ ఉదంతం వెలుగు చూసినప్పటికీ ఆ పార్టీ కనీ సం నోరు విప్పడం లేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని రాజకీ యం చేసి పబ్బం గడుపుకొనే నేతలంతా తమ పార్టీకి చెందిన వ్యక్తితో ఓ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లినా… పట్టించుకోవడం లేదు. గణేశ్ అనే బీజేపీ నాయకుడు చాలా రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పార్టీలో పెద్ద నాయకుల అండదండలతో సదరు వ్యక్తి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అనేక మంది గణేశ్ బాధితులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. డబ్బులు కావాలనుకునే వ్యక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అడిగినంతా ఇవ్వడం… సమయంలోపు చెల్లించకపోతే దాడులు చేయడం వంటివి బీజేపీ నాయకుడికి పరిపాటిగా మారినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కాల పరిమితి మించితే బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుని అసలు కన్నా వడ్డీల రూపంలో డబ్బులను భారీగా గుంజడంలో ఈయన సిద్ధహస్తుడిగా తెలుస్తున్నది. ఇతడితో పాటు చాలా మంది బీజేపీ నాయకులు ఇప్పుడు ఓ కీలక ప్రజాప్రతినిధి అండతో ఇందూరులో అమాయకుల పొట్ట కొడుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు స్పందించకపోవడం చూస్తుంటే విడ్డూరంగా మారింది.
నిందితులు పరార్…
ఆత్మహత్యకు ముందు పప్పుల సురేశ్, ఆయన పెద్ద కుమారుడు విడుదల చేసిన వీడియో, ఆడియో, లేఖలను ఆధారంగా చేసుకొని విజయవాడ కమిషనరేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు పెట్టగా… ఘటనా స్థలిలో లభించిన ఆధారాల ప్రకారం నలుగురు నిందితులపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నది. సురేశ్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు బాహ్య ప్రపంచానికి తెలిసిన వెంటనే ఫైనాన్షియర్లు పరారయ్యారు. మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ చిక్కకుండా పోయారు. సెల్ఫీ వీడియోలో ఫైనాన్షియర్ల పేర్లు, వారి మొబైల్ నంబర్లను మృతుడు సురేశ్ వెల్లడించారు.
బాధితులు ఉంటే ఫిర్యాదు చేయండి : సీపీ
పప్పుల సురేశ్ కుటుంబాన్ని బలి తీసుకున్న ఫైనాన్షియర్లకు చాలా మంది అమాయకులు బాధితులుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి బెదిరింపులకు గురైన వారుంటే స్థానికంగా పోలీసులకు రాతపూర్వకంగా, ఆధారాలతో ఫిర్యాదులు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ నాగరాజు వెల్లడించారు.
విజయవాడలో నలుగురిపై కేసు నమోదు
సెల్ఫీ వీడియోలు బయటికి రావడంతో విజయవాడ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.అయితే ప్రస్తుతం కేసు దర్యా ప్తు నిర్వహిస్తామని విజయవాడ కమిషనర్ క్రాంతి రాణాటాటా తెలిపారని.. వారు కేసును తమకు ఫార్వర్డ్ చేసే ఇక్కడ దర్యాప్తు నిర్వహించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.
చంపుతామని బెదిరించారు:సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోలో వ్యాపారి సురేశ్
తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడానికి వడ్డీ వ్యాపారుల ఒత్తిడే కారణమంటూ మృతుడు సురేశ్ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో సురేశ్ తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బీజేపీ నాయకుడు గణేశ్ 20 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేస్తూ మమ్మల్ని తీవ్రంగా వేధింపులకు గురి చేశాడు. అతని వద్ద తీసుకున్న బాకీకి ఇప్పటి వరకు రూ.50 నుంచి 60 లక్షల వరకు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు కట్టమంటూ ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగకుండా ఇంటికి తాళం వేస్తానంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. మాకు బాకీ ఇచ్చిన మరో వడ్డీ వ్యాపారి జ్ఞానేశ్వర్ ఇప్పటి వరకు రూ.40 నుంచి 50 లక్షల వరకు మావద్ద నుంచి వడ్డీ వసూలు చేశాడు. అంతే కాకుండా మళ్లీ బలవంతంగా భార్య, పిల్లలతో చెక్కులు,ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్స్, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని వేధింపులకు పాల్పడడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాం.
40,50 మందితో ఇంటికి వచ్చి దాడి చేస్తామని, పరువు తీస్తామని వడ్డీ వ్యాపారి జ్ఞానేశ్వర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయన వలన మాకు ప్రాణహాని ఉంది. అందుకే మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నాం. నిర్మల్ జిల్లాకు చెందిన వినీత అనే ఓ మహిళ వద్ద అవసరం నిమిత్తం అప్పు తీసుకున్నాను. అయితే డబ్బులు కోసం ఆమెతో పాటు ఆమె మరిది చంద్రశేఖర్ మాకు ఫోన్లు చేసి చంపుతామంటూ బెదింపులకు పాల్పడ్డారు. నిజామాబాద్‌లో కూడా ప్రతి గల్లీకి వందమంది పరిచయస్తులు ఉన్నారని, వారితో వచ్చి మీ సంగతి చూస్తామంటూ బెదిరించారు. మా చావుకు ఈ నలుగురు కారణం, దయచేసి వారిపై చర్యలు తీసుకోవాలంటూ’ సెల్పీ వీడియోలో సురేశ్ కోరాడు.