e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home నిజామాబాద్ పది పాసవడం సులువే..

పది పాసవడం సులువే..

పది పాసవడం సులువే..

రెండు నెలల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన మొదలైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా కాలంలో విద్యార్థులకు ఊరట కల్పించింది. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు తక్కువ సమయం ఉండడంతో ప్రస్తుతం నిర్వహించే పరీక్షల్లో 11 పేపర్లను 6 పేపర్లకు కుదించారు.
టీచర్ల సలహాలు పాటిస్తే అధిక మార్కులు..
మే 17 నుంచి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనుండడంతో విద్యాశాఖ పేపర్లు, సిలబస్‌ను కుదించింది. తక్కువ సమయంలో విద్యార్థులపై అధిక ఒత్తిడి పడకుండా 11 పేపర్ల స్థానంలో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ సిలబస్‌ను కృత్యాధారణతో అందించి అంతర్గత పరీక్షల ద్వారా మదింపు చేసేలా చర్యలు తీసుకున్నారు. మిగిలిన 70 శాతం సిలబస్‌ నుంచి రూపొందించే ప్రశ్నాపత్రంలో 50 శాతం ఎంపిక (చాయిస్‌) కల్పించారు. ప్రతి రెండు ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకే స మాధానం రాసే అవకాశం ఉంటుంది. దీంతో ప్రణాళికాబద్ధంగా మిగిలిన సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే మంచి గ్రేడ్‌ పాయింట్‌ సాధించవచ్చని అంటున్నారు సబ్జెక్టు నిపుణులు. కాగా కొవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాల లు తాత్కాలికంగా మూతపడ్డా యి. ప్రభుత్వం తదుపరి తీసుకునే నిర్ణయంపై పరీక్షల విధానం ఆధారపడి ఉంటుంది.

హిందీకి ఎప్పుడూ ఒకే పేపర్‌ ఉంటుంది
హిందీకి అప్పుడు ఇప్పుడు ఒక్కటే పేపర్‌ ఉంటుంది. ఇందులో పార్ట్‌-ఏ 60 మార్కులు, పార్ట్‌-బీ 20 మార్కులుగా విభజించారు. ఉపవాచకంలో శాంతి కి రహమే, హమ్‌ సబ్‌ ఏక్‌హై, అనోఖ ఉపాయ్‌ చదివితే మంచి స్కోర్‌ చేయవచ్చు. విభాగం- 1 లో శబ్ధ బండర్‌కి సంబంధించిన 10 బహుళైచ్చిక ప్రశ్నలు, 10 వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్‌ చొప్పున 20 మార్కులుంటాయి. బిట్‌ పేపర్‌ దిద్దడం మళ్లీ రాయడం చేయవద్దు.
-కర్తన్‌ అనుపమ, జడ్పీహెచ్‌ఎస్‌, పిప్రి, ఆర్మూర్

ప్రశ్నాపత్రాల విధానంలో మార్పులు..

హిందీ మినహా అన్ని సబ్జెక్టులకు గతంలో రెండు పేపర్లు ఉండేవి. ఇప్పుడు 80 మార్కులకు ఒకటే పేపర్‌ ఉంటుంది. సమయం మూడు గంటల 15 నిమిషాలు కేటాయించారు. మిగతా 20 మార్కులు అంతర్గత పరీక్షల ద్వారా మదింపు చేశారు. ప్రతి సబ్జెక్టులో పార్ట్‌-ఏ 60 మార్కులకు, పార్ట్‌-బీ 20 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్‌ మాత్రం పార్ట్‌-ఏ 40 మార్కులకు, పార్ట్‌-బీ 40 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఇంగ్లిష్‌లో మార్కులు సాధించడం సులభం..
ఈ సంవత్సరం ఇంగ్లిష్‌లో రెండు పేపర్లకు బదులుగా ఒకే పేపరు ఉంటుంది. పార్ట్‌ -ఏ 40 మార్కులు, పార్ట్‌-బీ 40 మార్కులు. విన్న పాఠాలను పదే పదే చదవండి. మల్టీపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌ జాగ్రత్తగా చదివి ఎంచుకోవాలి. ప్రతి బిట్‌ను జాగ్రత్తగా చదివి రాయాలి లేదంటే ఎక్కువ మార్పులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
-సఫీనా అహ్మద్‌, ఉపాధ్యాయురాలు,ఆదర్శ పాఠశాల, నందిపేట్

లఘు ప్రశ్నలకు అవగాహనతోనే సమాధానాలు..
విద్యార్థులకు భారం తగ్గించడానికి తెలుగులో మూడు పాఠాలను తొలగించారు. ఎక్కువ చాయిస్‌ ప్రశ్నలు ఇవ్వడం ద్వారా విద్యార్థులు సులభంగా సమాధానాలు రాయడానికి వీలుంది. ముఖ్యంగా లఘు సమాధాన ప్రశ్నలకు పాఠ్యాంశం అవగాహన చేసుకుని రాయవచ్చు. పార్ట్‌-బీలో పదజాలం, వ్యాకరణ అంశాలను ప్రశ్నిస్తారు. కాబట్టి పాఠ్యాంశం వెనుక ఉన్న కొత్త సంధులు, అలంకారాలపై దృష్టి పెట్టాలి.
-డాక్టర్‌ పి.శారద, పాఠశాల సహాయకులు, జడ్పీహెచ్‌ఎస్‌, వర్ని

పట నైపుణ్యం, సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి..
సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహన, పట నైపుణ్యం, సమకాలీన అంశాలపై ప్రతి స్పందన, విద్య ప్రమాణాలపై ప్రశ్నలు, భారతదేశంలో నదులు, పీఠభూములు, నగరాలు, భౌగోళిక అంశాలపై సాధన చేయాలి. ఇచ్చిన పాఠ్యంశాన్ని పూర్తిగా చదివి, అర్థం చేసుకోవడం, పట్టికలు, గ్రాఫ్‌ విశ్లేషణలు ఎంతో ముఖ్యం. వెనుకబడిన విద్యార్థులు ఒక్క మార్కు, రెండు మార్కుల ప్రశ్నలు, పట నైపుణ్యంపై దృష్టి సారించాలి.
-నాయక మురళీధర్‌, ఉపాధ్యాయుడు,యానంపల్లి జడ్పీహెచ్‌ఎస్

గ్రాఫ్‌, త్రిభుజ నిర్మాణం, స్పర్శరేఖలపై దృష్టి సారించాలి..
వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, వైశ్లేషిక రేఖా గణితం, సంఖ్యాక శాస్త్రం, సంభావ్యత పాఠాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు వస్తాయి. ముఖ్యంగా గ్రాఫ్‌ లెక్కలు, త్రిభుజ నిర్మాణం, స్వర్శరేఖలు గీయడం ఎత్తులు, దూరాలకు సంబంధించిన సమస్యలకు పటాలను గీయడం ప్రాక్టీస్‌ చేస్తే తప్పకుండా పాసవుతారు. గణితం 80 మార్కులు, ఒకటే పేపర్‌. ఇందులో పార్ట్‌-ఏ 60 మార్కులు, పార్ట్‌-బీ 20 మార్కులుగా విభజించారు.
-గోపాలకృష్ణ, జడ్పీహెచ్‌ఎస్‌, మల్కాపూర్‌ ఎస్‌ఏ, మ్యాథ్స్

భౌతికశాస్త్రంలో 1,4,5వ చాప్టర్లతో మంచి మార్కులు..
భౌతికశాస్త్రంలో 1, 4, 5వ చాప్టర్‌లతో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ మూడు చాప్టర్లు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కలిపి చదవాలి. టాపిక్స్‌ పోల్చుకుంటూ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు సతమతం కాకుండా పరీక్షలో మంచి మార్కులు పొందవచ్చు. భౌతిక రసాయన శాస్త్రంలో 1 నుంచి 6వ చాప్టర్‌ వరకు పూర్తిగా చదవగలిగితే విద్యార్థులు 75శాతం స్కోర్‌ చేయవచ్చు.
-టి.నితిన్‌, ఉపాధ్యాయుడు, ఎల్లారెడ్డిపల్లి

బొమ్మలు, భాగాలను గుర్తించాలి..
జీవశాస్త్రం పాఠ్యాంశాల్లోని బొమ్మలు గీయడం, భాగాలను గుర్తించడంతో పాటు వాటి విధులను కూడా తెలుసుకొని ఉండాలి. సంక్షిప్త, వ్యాసరూప ప్రశ్నలతో అవసరం ఉన్నచోట బొమ్మలు గీయాలి. మానవుని జీవ వ్యవస్థ, వాయు ప్రసార మార్గం ఫ్లో చార్ట్‌లను ఎక్కువగా అవగతం చేసుకోవాలి. విటమిన్‌లు, ఎంజైమ్‌లు, మొక్కలలో హార్మోన్‌లను అంతస్రావ గ్రంథుల పట్టికలను కచ్చితంగా చదవాలి. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆత్మవిశ్వాసంతో ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
-రమేశ్‌, ఉపాధ్యాయుడు,జడ్పీహెచ్‌ఎస్‌ రాంమందిర్‌, ఆర్మూర్‌.

జనరల్‌ సైన్స్‌..
జనరల్‌ సైన్స్‌లో భౌతిక శాస్ర్తానికి 40 మార్కులు, జీవ శాస్త్రానికి 40 మార్కులుగా విభజించారు. సమాధానాలు వేర్వేరు బుక్‌లెట్లలో రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు జనరల్‌ సైన్స్‌ పరీక్ష రాసేటప్పుడు అప్రమత్తతో వేర్వేరు బుక్‌లెట్లలో జాగ్రత్తగా రాయాలని సూచిస్తున్నారు. సందేహాల నివృత్తికి సబ్జెక్టు టీచర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించే అవకాశం కల్పించారు.

ఇవీ కూడా చదవండి..

బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చ‌రిక‌

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ సాధనకు ఇక సమరమే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పది పాసవడం సులువే..

ట్రెండింగ్‌

Advertisement