e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home నిజామాబాద్ నేటి నుంచి లాక్‌డౌన్‌

నేటి నుంచి లాక్‌డౌన్‌

నేటి నుంచి లాక్‌డౌన్‌
  • కరోనా మహమ్మారిపై యుద్ధం..
  • పది రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • 20 గంటలు సకలం బంద్‌.. 4 గంటలు మినహాయింపు

నిజామాబాద్‌, మే 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించింది. దాదాపుగా 14 నెలల క్రితం అమలైన లాక్‌డౌన్‌ తిరిగి మరోమారు రెండోసారి అమల్లోకి రానుంది. ప్రజలంతా పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి వారు స్వీయ నియంత్రణను పాటిస్తున్న దరిమిలా లాక్‌డౌన్‌ ప్రకటన మూలంగా కరోనా నియంత్రణలోకి వచ్చే అవకాశాలున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.

రోజురోజుకూ వేగంగా విస్తరిస్తున్న మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ అనివార్యమైన వేళ.. పది రోజులపాటు రోజుకు 20గంటలు సకలం బంద్‌ కానున్నాయి. జనజీవన కార్యకలాపాల నిమిత్తం రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాస్త సడలింపును ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా నిత్యావసరాలు, అత్యవసరాలను తీర్చుకునేందుకు ఉదయం నాలుగు గంటల పాటు మినహాయింపు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగితే పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ మూలంగా ప్రజల్లో కొద్దిగా అవగాహన ఏర్పడింది. లాక్‌డౌన్‌తోనూ ఇండ్లకే పరిమితమై కరోనా కట్టడికి సహకరిస్తారని సర్కారు అంచనా వేస్తున్నది.

14 నెలల్లో రెండోసారి..
చైనాలో పుట్టి యావత్‌ ప్రపంచం మొత్తం పాకిన అతి సూక్ష్మమైన వైరస్‌తో మానవ సమాజం మొత్తం యుద్ధం చేస్తున్నది. కంటికి కనిపించని వైరస్‌తో అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా అనేక వ్యవస్థలు కరోనాతో కుప్పకూలుతున్నాయి. 2019 నవంబర్‌ నెలలో చైనాలో వెలుగు చూసిన భయానక వైరస్‌ సరిగ్గా ఏడాదిన్నర కాలంలోనే అన్ని దేశాలను చుట్టేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసి.. కోట్లాది మందికి అంటుకొని ఆగం పట్టిస్తున్నది. మన దేశంలోకి 2020 ప్రథమార్థంలో చొచ్చుకొచ్చిన వైరస్‌ మూలాలు మార్చి నెల ప్రారంభం నుంచి ఒక్కో కేసు పెరుగుతూ వందలు, వేలు, లక్షల్లోకి చేరాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోనూ గత మార్చి నుంచి కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. మొదటి వేవ్‌ను అడ్డుకట్టే వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ, మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌తో నెలన్నర రోజులు దేశవ్యాప్తంగా సర్వం బంద్‌ అయ్యాయి. తాజాగా సెకండ్‌ వేవ్‌ ముప్పు నుంచి బయట పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుతో 14 నెలల కాలంలో రెండోసారి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం గమనార్హం.

సందట్లో సడేమియాలు..
లాక్‌డౌన్‌ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుందో లేదో కొంత మంది అక్రమార్కులు ధనార్జనకు తెర లేపారు. చిటికెలో తమ ఉపాయాలన్నింటినీ ప్రయోగించి కల్పిత కొరతలను సృష్టించేందుకు పూనుకోవడం మంగళవారం మధ్యాహ్నం నుంచే కనిపించింది. ప్రభుత్వం అధికారికంగా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.. మద్యం వ్యాపారులు గతం మాదిరిగా బ్లాక్‌లో వేల రూపాయలకు అమ్ముకోవచ్చనే దురాలోచనతో షాపులను క్లోజ్‌ చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే మందు అయిపోయిందంటూ చెప్పడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. అదే దుకాణాల్లో సాయంత్రం పూట రెట్టింపు ధరలకు మద్యాన్ని విక్రయించడం ద్వారా వ్యాపారుల తీరు బహిర్గతమైంది. ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్సైజ్‌ శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రజలు మంగళవారం సాయంత్రం నుంచే పోటెత్తారు. పది రోజులకు సరిపడా సామాన్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు పయనం కావడంతో రద్దీ కనిపించింది. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడతో పాటుగా బిచ్కుంద, భీంగల్‌ వంటి ప్రాంతాల్లో కొంతమంది వ్యాపారులు సరుకుల ధరలను అమాంతం పెంచి విక్రయించడంతో సామాన్యులు తీవ్రఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌ ప్రకటనతో బస్‌స్టేషన్లలో రద్దీ పెరిగింది.

అతిక్రమిస్తే కఠిన చర్యలు..
కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటిని ప్రజలంతా కచ్చితంగా తెలుసుకొని పాటించాల్సిందే. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసి ప్రజలను ఇండ్లకే పరిమితం చేసేందుకు అనేక కఠిన నిబంధనలు యంత్రాంగం అమలు చేయబోతున్నది. ముఖానికి తొడిగే మాస్కు నుంచి కారులో ప్రయాణం, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం వరకు అనేక రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. వీటిపై అవగాహన కలిగి ఉండడం వ్యక్తిగతంగానే కాదు.. సమాజానికి కూడా శ్రేయస్కరం. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రతిఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కటకటాలకు పంపించేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారు. కొంత మంది వ్యక్తుల నిర్లక్ష్య వైఖరి మూలంగానే కరోనా వ్యాప్తి చెప్పలేనంతగా విస్తరించింది. మాస్కులు వాడకపోవడం, నాకేం కాదన్న అతి విశ్వాసం, భౌతిక దూరానికి విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా మిగిలిన వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పోకిరీల భరతం పట్టేందుకు లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించనున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేటి నుంచి లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement