నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామ జనాభా 2400. ఒకప్పుడు అరకొర సదుపాయాలతో చివరి స్థానంలో ఉన్న పిప్రి గ్రామంలో ఇప్పుడు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నది. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన పల్లె ప్రగతి గ్రామ రూపురేఖలను మార్చేసింది. పంచాయతీలకు పుష్కలంగా నిధులు మంజూరు చేయడంతో గ్రామాల్లో వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, ట్రాక్టర్ ట్యాంకర్, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డైనేజీలు, అవెన్యూ ప్లాంటేషన్ సమకూరాయి. పాడైపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటయ్యాయి. శిథిలావస్థలో ఉన్న భవనాల తొలగింపు, పాడుబడిన బావుల పూడ్చివేతలాంటి పనులన్నీ చకచకా జరిగాయి.
ప్రగతి వెలుగులు..
గ్రామంలోకి ప్రవేశించే రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లు పచ్చదనంతో ఆహ్వానం పలుకుతున్నాయి. పల్లె ప్రగతితో గ్రామంలో మౌలిక వసతుల కల్పన వేగవంతం అయ్యింది. గతంలో రాత్రి అయ్యిందంటే చిమ్మ చీకట్లో ఉండే పిప్రి గ్రామంలో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. నాడు శ్మశానవాటికల పరిస్థితి దుర్భరంగా ఉండేది. ప్రస్తుతం పల్లె ప్రగతిలో భాగంగా నిర్మించిన వైకుంఠధామం పార్కును తలపిస్తున్నది. అక్కడ నిర్మించిన నిర్మాణాలపై అందమైన చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే దాతల సహకారంతో వైకుంఠధామం, ప్రకృతివనంలో బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. నర్సరీలో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతివనంలో మియావాకి పద్ధతిలో పెంచిన మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి చిట్టడవిని తలపిస్తున్నది. రెండున్నరేండ్లలోనే లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పొడి చెత్తను వేరు చేసి వాటిని అమ్మడంతో గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరుతోంది. కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ ప్రకృతివనంలోని మొక్కలకు వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లాను బిగించి శుద్ధనీటిని సరఫరా చేస్తున్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
పిప్రి గ్రామంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నాం. పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అధిక నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి సాధ్యమైంది.
సుందరంగా తయారైంది
సీఎం కేసీఆర్ సారు తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామం సుందరంగా మారింది. ఆరేండ్ల కిందట మురికి కాల్వలు, రోడ్లన్నీ అంతంత మాత్రంగానే ఉండేవి. ఇప్పుడు మురికి కాల్వలు శుభ్రంగా మారాయి. ప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటడంతో గ్రామం మొత్తం ఆకుపచ్చగా కనిపిస్తున్నది. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
-జనార్దన్, గ్రామస్తుడు
ఆగం .. ఆగంగా ఉండేది
నా చిన్నతనంల ఊరు బాధలు పట్టించుకునే వారు లేక ఆగం.. ఆగంగా ఉండేది. కేసీఆర్ సర్కారు అచ్చినంక ఆఫీసర్లు మంచిగ పని చేస్తుండ్రు. ఆనకాలం అచ్చిందంటే మోర్లు నిండి ఆసన అచ్చేటివి. నెలలకొద్ది తీయకపోతుండె. దోమలు పెరిగి జరాలు అచ్చేటివి. ఇప్పుడు సపాయోల్లు అచ్చి మోర్లు తీస్తుండ్రు.
గ్రామం రూపుమారింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకున్నది. గత మూడు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వంద శాతం పూర్త్తిచేశాం. నాల్గో విడుత కార్యక్రమంలో భాగంగా గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుకుంటాం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్న సీఎం కేసీఆర్ ఆశయం పల్లె ప్రగతిలో సాకారమవుతున్నది.
-ప్రవీణ్, సర్పంచ్ పిప్రి