వర్ని, జూలై 2: ఇంటింటికీ తాగునీరు, గుంట గుంటకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామీణ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో లక్షా 50 వేల ఎకరాల వ్యవసాయభూమి సాగులో ఉందని ఇందులో సుమారు 30వేల ఎకరాలకు నిజాంసాగర్ నీరు రావడంలేదన్నారు. వీరంతా వర్షాధారం, బోరు బావుల కింద పంటలు పండిస్తున్నారని తెలిపారు. వీరికి కూడా సాగునీరందించేందుకు ఎత్తిపోతల పథకాలు, చెక్డ్యాములను మంజూరుచేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా జాకోరా, చందూర్, లక్ష్మాపూర్ ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 10వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఇందుకోసం రూ.106 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. సిద్ధాపూర్ గ్రామం వద్ద 72.5 కోట్లతో చెరువుల నిర్మాణం చేపట్టి, మరో 50 కోట్లతో కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేస్తే అభివృద్ధి సులభతరం అవుతుందన్నారు.
ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఆర్డీవో రాజేశ్వర్, వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, ఏఎంసీ చైర్మన్ బందెల సంజీవులు, మండల కో- ఆప్షన్ సబ్యుడు కరీం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సింగంపల్లి గంగారాం, విండో చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచులు అనిత, కోర్వ గోదావరి, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, అధికారులు పాల్గొన్నారు.je