Nizamabad | వినాయక్ నగర్, ఫిబ్రవరి25 : నిజామాబాద్ శివారులోని ఆర్టీసీ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీకి వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి.. ఐదు తులాల బంగారం దోచుకెళ్లారు.
నిజామాబాద్ రూరల్ ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథ్ పవర్ అనే ఆర్టీసీ డ్రైవర్ మూడు రోజుల క్రితం డ్యూటీ పై తిరుపతికి వెళ్లారు. ఆయన సతీమణి సైతం ముంబైలోని తన కూతురు వద్దకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి ఉంచారు. రెండు మూడు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు.. ఇంటి తాళం ధ్వంసం చేసి, బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. డ్యూటీకి వెళ్లొచ్చిన తర్వాత రఘునాథ్.. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని మొత్తం పరిశీలించారు. చోరీ జరిగిన తీరుపై స్థానికంగా విచారణ నిర్వహించారు.