ఇందూరు, జూలై 25 : జిల్లాలో డెంగీ, మలేరియా, అతిసారం, విషజ్వరాల వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, వసతిగృహాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు రక్షిత తాగునీరు, నాణ్యమైన భోజనం అందేలా ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు.
ఈగలు, దోమలు, బొద్దింకలు, పురుగుల నివారణకు అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక పద్ధతులను వినియోగించాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై రాష్ట్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, నివాస ప్రాంతాల వారీగా శానిటేషన్ పనులను అనునిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయించాలని, ప్రతి వాటర్ ట్యాంకునూ శుభ్రం చేయిస్తూ క్లోరినేషన్ జరిగేలా చూడాలన్నారు. మురుగు, వర్షపునీరు నిల్వ ఉండకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, దోమల వృద్ధిని నిరోధించేందుకు ఫాగింగ్, ఆయిల్‌బాల్స్ తదితర చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఇండ్లకు తలుపులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, దోమలు లోనికి ప్రవేశించకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పాఠశాలల్లో పాడైపోయిన బియ్యం, ఇతర సరుకులను వినియోగించొద్దని, నాణ్యమైన బియ్యం అందించాల్సిందిగా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశిస్తామన్నారు. నిధుల సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్వయలోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ దోమతెరలు వినియోగించేలా చూడాలన్నారు.
ఈ మేరకు వెంటనే స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. నివాస ప్రాంతాల్లో పరిసరాలను పరిశీలిస్తూ, సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ఇంటింటికీ స్టిక్క ర్లు అతికించాలని సూచించారు. హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే నోటీసులు జారీ చేయాలని, మార్పు రాకపోతే పెద్దమొత్తంలో జరిమానా విధించాలన్నారు.
నివాస ప్రాం తాల సమీపంలో పెంటకుప్పలు తొలగించేందుకు చొరవ చూపాలని, అవసరమైతే కఠిన నిర్ణయాలతో ముందుకెళ్లాలన్నారు. 12 ఏండ్లు నిండినవారు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని ఆదేశించా రు. పాఠశాలలు, కళాశాలల్లో మంగళవారం నుంచే వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రతిరోజూ కనీసం 30 వేల మందికి టీకా వేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
విద్యా సంస్థల్లో వారం రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసి, మిగతా వారందరికీ టీకాలు అందజేయాలని ఆదేశించారు. సమీ క్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, డీఎంహెచ్‌వో సుదర్శనం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.