వినాయకనగర్, జూలై 8: భర్త తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాడని అసహనానికి లోనైన ఇల్లాలు అతడ్ని అంతమొందించింది. కొడుకు, కోడలితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పాటు మరో యువకుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన చోటు చేసుకున్న మోపాల్ మండలంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది.
వారం వ్యవధిలోనే భార్యల చేతిలో ఇద్దరు భర్తలు హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. సౌత్ రూరల్ సీఐ సురేశ్‌కుమార్ కథనం ప్రకారం.. మోపాల్ మండల పరిధిలోని అమ్రాద్ జీపీ కోక్యనాయక్ తండాలో నివాసముండే బానోత్ హరి (50)కి భార్య మీరాబాయి, కుమారుడు సురేశ్, కోడలు రజితతో కలిసి నివాసముంటున్నాడు. మద్యం తాగే అలవాటు ఉన్న హరి.. తాగివచ్చి ఇంట్లో వారితో తరచూ గొడవ పడే వాడు. మంగళవారం తండాలో నిర్వహించిన శీతల్ వేడుకల్లో మద్యం సేవించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. మళ్లీ రాత్రి ఇంటికి వచ్చాక కూడా గొడవ జరిగింది. భర్త వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భార్య మీరాబాయి అతడ్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది.
రాత్రి 10.30 గంటల సమయంలో హరి నిద్రిస్తుండగా, కొడుకు సురేశ్, కోడలు రజితతో కలిసి అతని గొంతు నులిమి హత్య చేశారు. బుధవారం ఉదయాన్నే చుట్టుపక్కల వారు వచ్చి ఏం జరిగిందని అడిగితే, తామే హత్య చేశామని మీరాబాయి చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సౌత్ రూరల్ సీఐ సురేశ్‌కుమార్, మోపాల్ ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించిన పోలీసులు.. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.