ప్రతి రోజూ దేవుడి ఎదుట దీపం వెలిగించి నైవేద్యం సమర్పించే అర్చకులకు ధూపదీప నైవేద్యం పథకం ఎంత మాత్రం ఉపయోగపడడం లేదు. డీడీఎన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం సమయానికి అందడం లేదు. దీంతో దేవుడి దీపానికి, ధూపానికి కష్టంగా మారింది. ధూప దీప నైవేద్య అర్చకులను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.
సుభాష్‌నగర్, ఏప్రిల్ 4: దేవాలయాల్లో స్వామి వార్లకు ధూపం, దీపం, నైవేద్యం, నివేదన భారం గా మారింది. అర్చకులు స్వామి వారికి నిత్యపూజలు, అర్చనలు చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ధూప దీప నైవేద్య పథకం కింద రాష్ట్ర ప్రభు త్వం నెలనెలా ఇవ్వాల్సిన రూ. 10,000 ప్రోత్సాహకం అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాతల సహకారం, అ ప్పు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి వస్తున్నదని అర్చకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 1358ఆలయాలు ఉన్నాయి. వీటిలో నిత్య ధూప దీప నైవేద్య పథకానికి 594 ఎంపికయ్యాయి. గతేడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా లో నూతనంగా మొదటి విడుత గా 187 ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం కింద ఎంపిక చేశారు. అక్టోబర్ నెలలో కామారెడ్డిలో 38, నిజామాబాద్‌లో 40 ఆలయాలను ఎంపి క చేసి ఉత్తర్వులను అందించారు. అర్చకులకు రూ. 6వేలు ఉన్న ప్రోత్సాహకాన్ని కేసీఆర్ ప్రభుత్వం రూ.10వేలకు పెంచుతూ మొత్తం 78 దేవాలయాల అర్చకులకు నియామక ఉత్తర్వులు అందించారు. అక్టోబర్ నుంచి ఆరు నెలలుగా ప్రభుత్వం నుంచి రూ. 10వేలు ప్రోత్సాహకం అర్చకులకు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రూ.10 వేల చొప్పున అర్చకుల ఖాతాలో జమ చేయాలని జిల్లా ధూప దీప నైవేద్యం పథకం కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
పెంచిన ప్రోత్సాహకం నేటికీ అందలేదు. దీంతో స్వామి వారి పూజలకు తామే సొంత ఖర్చులను భరించాల్సి వస్తున్నది. అక్టోబర్ నెల నుంచి ఆరు నెలలుగా ప్రోత్సాహకం అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది.
కొత్తగా ఎంపికైన 78 ఆలయాలకు ప్రోత్సాహకాలు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆలయ అర్చకుల ఆరు నెలల ప్రోత్సాహకాలను విడుదల చేయాలని కోరుతున్నాం.