వేల్పూర్, నవంబర్ 29 : ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అని ఉద్యమ వీరుడు బయల్దేరిన రోజు దీక్షా దివస్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 2004లో రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారని..కానీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడ్డారని తెలిపారు. ఆయన వల్లే వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారని అన్నారు. కోట్లాది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారన్నారు. వేల్పూర్ మండల కేంద్రం లో దీక్షాదివస్‌లో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన దీక్ష మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహోన్నత ఘట్టమని అన్నారు. ఐదేండ్ల ముందే రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రగతి ఐదేండ్లు ముందు ఉండేదని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అనతి కాలంలోనే దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారని తెలిపారు.
కేసీఆర్ ఒక టార్చ్ బేరర్.. ఆయన సైనికుడిని అయినందుకు గర్వపడుతున్నాని మంత్రి పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ చేసిన పోరాటంతో అప్పట్లో కాంగ్రెస్, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒత్తిడితో మాట తప్పారని గుర్తు చేశారు. మాట తప్పిన కాంగ్రెస్‌తో పొత్తుని తెంచుకొని మంత్రి పదవులను గడ్డి పోచలా వదిలేసి తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న శక్తులన్నింటినీ ఎదుర్కొని తన ప్రాణాలను పణంగా పెడుతూ నిరాహార దీక్ష చేపట్టి అనుకున్నది సాధించారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు భూమేశ్, ఏలియా, పూర్ణానందం, దేవేందర్,ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, ఎంపీపీ భీమ జమున, సొసైటీ చైర్మన్లు మోహన్‌రెడ్డి, హన్మంత్ పాల్గొన్నారు.