విద్యానగర్, నవంబర్ 25 : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ పాఠశాలలో ప్రారంభించిన జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ రెండో రోజైన శుక్రవారం కొనసాగింది. సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీలో పురోగతి, పర్యావరణహితమైన పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా ఆవిష్కరణలు, పర్యావరణం, ప్రస్తుత ఆవిష్కరణతో చారిత్రక అభివృద్ధి, మన కోసం గణితం అనే 7 అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేశారు. జిల్లాలోని పలు పాఠశాలల నుంచి 510 సైన్స్ ప్రాజెక్ట్‌లు పాల్గొన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మోడల్ స్కూల్ నుంచి సుమారు 30 మంది జడ్జీలు ప్రదర్శనలను పరిశీలించారు. రాష్ట్ర బృందం సభ్యులు ఎస్సీఆర్టీసీ నుంచి పుష్పలత, ఎన్ఐఎఫ్ నుంచి ప్రత్యేక ప్రతినిధి విరాల్ చౌదరి వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఈ ప్రదర్శనలను చూడడానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి 10 వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులకు డ్రాయింగ్, పాటలు, క్విజ్ పోటీలను నిర్వహించారు. శనివారం రోజు ముగింపు కార్యక్రమం ఉంటుందని డీఎస్వో సిద్ధిరాంరెడ్డి తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ముగింపు రోజున బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు, వివిధ కమిటీల కో – ఆర్డినేటర్లు, ఉపాధ్యాయ సంఘాలు, స్కౌట్ విద్యార్థులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్ ఫార్మర్ బరువు తగ్గించే పద్ధతి
పొలాల్లో రైతులు ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లేటప్పుడు అధిక బరువు ఉండడంతో మోయలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. రైతులకు సులభంగా తీసుకెళ్లడానికి ట్రాన్స్ఫార్మర్ను ఇనుముకు బదులుగా అల్యూమినియం, ప్లాస్టిక్‌తో తయారు చేసి, అన్యోన్య ప్రేరణ సూత్రం ద్వారా పని చేసే విధంగా తయారు చేశారు. కుడి చేతి బొటనవేలు నిబంధన ప్రకారం చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్కు కింద వీల్స్‌ను ఏర్పాటు చేశారు.
సులభంగా ధాన్యం నింపే యంత్రం
రైతులు పంటలను పండించిన తర్వాత ధాన్యాన్ని సంచుల్లో నింపడానికి కూలీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కూలీల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నది. దీంతో పంట పెట్టుబడి ఖర్చు పెరిగిపోతున్నది. సులభంగా తక్కువ మంది కూలీలతో, తక్కువ సమయంలో వడ్లను సంచుల్లో నింపడానికి, పంటలను ఆరబెట్టినప్పుడు కానీ సంచులను నింపడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది.
వేరు శనగను వేరు చేసే యంత్రం
పంట పొలాల్లో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి ఈ యంత్రం ఉపయోపడుతుంది. తక్కువ ఖర్చుతో వేరు శనగలను వేరు చేయడానికి ఈ యంత్రం రైతులకు ఉపయోగపడుతుంది.
పొలాల్లో మందులు స్ప్రే చేసే యంత్రం
రైతులు గట్లుగా గట్లుగా ఉన్న పొలంలో ఒకే చక్రం సహాయంతో మందును స్ప్రే చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. మధ్యతరగతికి చెందిన రైతులు అతి తక్కువ ఖర్చుతో ఈ యంత్రాన్ని తయారు చేసుకోవచ్చు. తక్కువ బరువుతో ఎవరైనా స్ప్రే చేయడానికి వీలు కలుగుతుంది.