ఖలీల్‌వాడి, నవంబర్ 25 : రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నరహరి ఆధ్వర్యంలో రజకులు, నాయీబ్రాహ్మణులు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ రవీందర్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సబ్సిడీ మీటర్లపై అధిక బిల్లులను నిరసిస్తూ కరెంట్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ అధికారుల బెదిరింపులకు నిరసనగా మోమోరాండం అందజేసినట్లు వారు తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాలైన రజక, నాయీబ్రాహ్మణ కుటుంబాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించాలని ఓ వైపు చెబుతున్నా.. విద్యుత్ శాఖ అధికారులు దానికి విరుద్ధంగా 250 యూనిట్లను కలుపుకొని విద్యుత్ చార్జీలు వేస్తున్నారని పేర్కొన్నారు. బిల్లులు కట్టకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, నిరుపేద రజక, నాయీబ్రాహ్మణ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వాపోయారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లాలోని ఏఈలకు సర్క్యులర్ జారీ చేయాలని ఎస్ఈని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, సర్క్యులర్ జారీ చేస్తామని ఎస్ఈ సానుకూలంగా స్పందించినట్లు ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి నరేశ్, పట్టణ అధ్యక్షుడు రాంచందర్, కార్యదర్శి సాయిలు, నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరహరి, ఉపాధ్యక్షుడు అనిల్, మహిళా అధ్యక్ష, కార్యదర్శులు రమాదేవి, రేఖ, ముఖ్యసలహాదారులు అమర్ జీవన్, సునీల్, జితేందర్, అనిల్, శ్యామ్‌రాజు, అజయ్, సుదర్శన్, నరేశ్, గొండ స్వామి, నరహరి, తిరుపతి, లక్ష్మణ్, నీలం చంద్రం, శ్రీనివాస్, కొమురయ్య పాల్గొన్నారు.