డిచ్పల్లి, నవంబర్ 15 : తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటైన 16 ఏండ్ల తర్వాత స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు అయినప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో క్రీడలు అందుబాటులోకి రాలేదు. స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటైతే విద్యార్థుల తలరాతలు మారుతాయని అందరూ భావించగా వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. బోర్డు అందుబాటులోకి వచ్చి 11 నెలల గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క సమావేశమైనా జరగలేదు. క్రీడల అభివృద్ధిపై ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఏడాదికోమారు డైరెక్టర్‌ను మార్చడం తప్ప స్పోర్ట్స్‌లో ఎలాంటి పురోగతి లేదు.
స్టేడియం నిర్మాణం అయ్యేదెన్నడో…
యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయా ల్లో 20-30 ఎకరాల్లో క్రీడా మైదానాలు ఉండాలి. తెలంగాణ విశ్వవిద్యాలయం 377 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ స్టేడియం లేకపోవడం దురదృష్టకరం. విద్యార్థులకు ప్రాక్టీస్ కోసం అరకొరగా ఉన్న క్రీడా మైదానమే దిక్కుగా మారింది. ఏండ్ల తరబడి ముళ్ల కంపల మధ్య ఉండే క్రీడామైదానంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలల క్రితం విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన వీసీ క్రీడామైదానాన్ని ట్రాక్టర్ల సహాయంతో చదును చేయించడంతో క్రీడామైదానం కొంచెం మెరుగుపడినట్లయ్యింది. టీయూ విద్యార్థులు చాలా సందర్భాల్లో ఆందోళనలు చేసి స్టేడియం, జిమ్, క్రీడా పరికరాలు సమకూర్చాలని ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్న సందర్భంలో విద్యార్థులకు వారు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి తప్ప ముందుకు సాగలేదు.
అన్నింటికీ ఒక్కడే….
యూనివర్సిటీకి ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ (ఔట్సోర్సింగ్) దిక్కు. విద్యార్థులకు క్రీడల్లో ఎలాంటి ప్రోత్సాహం లేదు. సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్, భిక్కనూర్ దక్షిణ ప్రాంగణాలకు పీడీలు సైతం లేరు. గేమ్స్ ఇన్చార్జిగా ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అధికారే ఉండాల్సి ఉండగా ఇక్కడ మాత్రం అధ్యాపకులకు బాధ్యతలు అప్పగిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది.
కోర్సులు అత్యవసరం…
ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఒక్క కోర్సు అయినా విశ్వవిద్యాలయంలో లేదు. ఇటీవల సారంగాపూర్ ఎడ్యుకేషన్‌లో నిర్వహించిన వార్షికోత్సవంలో బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులతో పాటు యోగా, కళలకు సంబంధించిన కొత్త కోర్సులు పరవేశపెడుతామని వీసీ ఆచార్య రవీందర్ హామీనివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థులకు అవసరమైన క్రీడాసామగ్రిని అందుబాటులోకి తెస్తే విద్యార్థులు జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి విశ్వవిద్యాలయానికి పేరుతెచ్చే వీలు కలుగుతుంది. దీనిపై యూనివర్సిటీ అధికారులు దృష్టిసారిస్తే బాగుంటుంది.