శక్కర్‌నగర్, నవంబర్ 13: బోధన్ మున్సిపల్ పరిధిలోని నర్సాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో బీటీ రోడ్డు నిర్మించినప్పటికీ భారీ వర్షాలతోపాటు ఏటా కేజ్‌వీల్ ట్రాక్టర్లు నడుపడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బోధన్- నిజామాబాద్ ప్రధాన రహదారి నుంచి దాదాపు కిలోమీటర్ మేర ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే గ్రామస్తులు నరకం అనుభవించారు.
రాత్రిపూట ప్రయాణించాలంటే మరింత భయపడేవారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. తమ కష్టాలను గ్రామస్తులు బోధన్ ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాలతో ఆర్అండ్బీ అధికారులు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి రెండు రోజుల్లో పూర్తిగా బీటీ రోడ్డు నిర్మించారు. నేడు అద్దంలా మారిన రోడ్డును చూసి నర్సాపూర్వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే షకీల్‌కు గ్రామస్తులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే షకీల్ చొరవతో..
బోధన్ పట్టణ పరిధిలోని నర్సాపూర్ గ్రామానికి రోడ్డు వేయాలని కోరడంతో ఎమ్మెల్యే షకీల్ వెంటనే స్పందించారు. ఆయన సూచన మేరకు ఆర్ అండ్ బీ అధికారులు రెండు రోజుల్లోనే బీటీ రోడ్డు నిర్మించారు. ఎమ్మెల్యే షకీల్, ఆర్అండ్బీ అధికారులకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు.
-డేగావత్ ధూప్‌సింగ్ నాయక్,నర్సాపూర్ (4వ వార్డు) కౌన్సిలర్