మేరు సంఘం ప్రమాణస్వీకారోత్సవంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
డిచ్పల్లి, నవంబర్ 13 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వవైభవాన్ని తీసుకువచ్చారని, అన్ని కులాల వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్లో రూరల్ నియోజకవర్గ మేరు సంఘం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మేరు సంఘం భవనాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మేరు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. నిరుపేద మేరు కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని, కుట్టుమిషన్లను సైతం పంపిణీ చేస్తామని అన్నారు.
మేరు కులవృత్తులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, స్కూల్ విద్యార్థులకు ఏకరూప దుస్తులను కుట్టే బాధ్యత తమకే అప్పజెప్పాలని, మేరు కులస్తుల దుకాణాలకు ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని ఎమ్మెల్యేకు మేరు కులస్తులు విన్నవించారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బాజిరెడ్డి జగన్‌తోపాటు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను గజమాలతో సత్కరించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, రూరల్ నియోజకవర్గాల ఎంపీపీలు, రూరల్ మేరు సంఘం అధ్యక్షుడు కొక్కు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి కర్ని చంద్రకాంత్, కోశాధికారి రాంగిరి మురళి, ఉపాధ్యక్షులు గుర్రపు భూమేశ్వర్, కొత్తూరు స్వామి, కామేశ్వర్, కొట్టూరు మురళి, మేరు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నె కిషన్, చరణ్, శాంభవి, సుదర్శన్, రాజేశ్వర్, హన్మంత్‌రావు, డీకొండ శ్రీనివాస్, డీకొండ హారిక, డీకొండ సరిత, డీకొండ సుధీర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు చింతశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దండుగుల సాయిలు, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, లక్ష్మీనర్సయ్య, మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు.