రామారెడ్డి, నవంబర్ 12: యమునిడి సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. అనారోగ్యాలబారిన పడ్డవారు, సంసార బాధలతో సతమతమయ్యేవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు కాలభైరవుడిని వేడుకుంటే సకల బాధలను హరింపజేస్తాడని నమ్మకం. యముడిని సైతం నిలువరించగల మహామృత్యుంజయుడు, కాలభైరవుడిని దర్శిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. నిష్టతో కొలిస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారని, దుష్టశక్తులతో బాధపడేవారికి రక్షణగా ఉంటారని విశ్వాసం. అందుకే నిత్యం భక్తుల తాకిడితో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయం విశిష్టతను సంతరించుకున్నది. నేటి నుంచి శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం..
అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ గ్రామాన్ని రక్షిస్తుంటారని నానుడి. ఈ అష్ట భైరవుల్లో ప్రధానుడు శ్రీకాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాల ప్రవాహంలో కనుమరుగైపోయాయి. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని కాశీపల్లి వద్ద విశ్వేశ్వరుని ఆలయం, రామేశుని కుంటలో శివాలయాలు వాటి దగ్గర భైరవ విగ్రహాలు ఉన్నాయి. ఇలా రామారెడ్డి గ్రామం చుట్టూ కాశీ, రామేశ్వరం పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద గల పుష్కరిణి ఉన్నది. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించే వారికి అన్ని రకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. నిత్య పూజలతోపాటు ప్రతి మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాలభైరవస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తికమాసంలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ప్రభురాంచందర్ తెలిపారు.
ఆదివారం గణపతిపూజ, పుణ్యాహవాచనం, సంతతధారాభిషేకం, కంకణధారణ అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 14న లక్షదీపార్చన, 15న సాయంత్రం 7 గంటలకు ఇస్సన్నపల్లి, రామారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న సంతతధారాభిషేకం సమాప్తి, ధ్వజారోహణం, మహాపూజ, సిందూరపూజ, డోలారోహణం, సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన, రాత్రి భద్రకాళిపూజ, పల్లకీసేవ, రథోత్సవం, ఒగ్గు కథ కాలక్షేపం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 17న మల్లికార్జున కౌలాస్ మహంత్, ప్రభాకర్ స్వామి, శ్రీశైలం,కోటయ్య దక్షయజ్ఞం, అగ్నిగుండాలు నిర్వహిస్తారు.
శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా ఐదురోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఉత్సవాలకు వివిధ జిల్లాలు, రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నివసతులు కల్పిస్తున్నాం.
– ప్రభురాంచంద్రం, ఆలయ ఈవో
భక్తుల పాలిట కల్పతరువు, కష్టాలను దూరం చేస్తూ భక్తులకు అండగా నిలిచే కరుణామూర్తి శ్రీ కాలభైరవుడు. నిత్యం స్వామి వారికి జలాభిషేకం, సిందూర పూజలు నిర్వహిస్తున్నాం. స్వామివారికి ప్రీతికరమైన వడలమాల, మడితో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తాం.
– రాచర్ల శ్రీనివాస్ శర్మ, ఆలయ పూజారి