ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణను కేంద్రప్రభుత్వం గాలికొదిలేసింది. నేషనల్ హైవేల ప్రకటనతోనే సరిపెట్టుకున్న మోదీ సర్కారు.. నిర్మాణ పనులపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారిన రోడ్ల కారణంగా వాహనదారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల నిజామాబాద్-ఛత్తీస్గఢ్ మధ్య గల 63వ జాతీయ రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి-భైంసా మధ్య నేషనల్ హైవే మంజూరై ఎనిమిదేండ్లు గడిచినా పనులకు మోక్షం కలగడం లేదు. కరీంనగర్-కామారెడ్డి- ఎల్లారెడ్డి (కేకేవై) జాతీయ రహదారి నిర్మాణ పనుల్లోనూ ముందడుగు పడడం లేదు.
– నిజామాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనీస బాధ్యతను నిర్వర్తించడం లేదు. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నది. ఫలితంగా ఆయా రాష్ర్టాల్లో కేంద్ర పథకాలు, ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. మోదీ సర్కారు కాలయాపన కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు మూలన పడ్డాయి. ప్రతిపాదనల పేరుతో భారీ ప్రకటనలు చేయడానికే బీజేపీ సర్కారు పరిమితమవుతున్నది. ఎక్కడా అభివృద్ధి అన్నదే కనిపించడం లేదు. రోడ్డు వేయకుండా తాత్సారం చేస్తుండడంతో రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఫలితంగా వందలాది మంది ఏటా మరణిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న బీజేపీ సర్కారు తీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మీదుగా చత్తీస్గఢ్ రాష్ర్టానికి వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఎల్లారెడ్డి మీదుగా భైంసాకు, కరీంనగర్ నుంచి వయా కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డికి వచ్చే మరో జాతీయ రహదారి పనులకు మోక్షమే లభించడం లేదు. వాణిజ్యపరంగా అత్యధిక ప్రయోజనాలను చేకూర్చే ఈ ప్రాజెక్టులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నది.
భైంసాకు దారేది..?
హైదరాబాద్ నుంచి భైంసా వరకు జాతీయ రహదారి మంజూరై ఎనిమిదేండ్లు గడిచింది. పూర్తి స్థాయిలో పనులకు మోక్షం కలగడం లేదు. మెదక్ వరకు పను లు పూర్తయినా, ఎల్లారెడ్డి, బోధన్ మీదుగా భైంసా వరకు ఎప్పుడు పూర్తవుతాయో ఢిల్లీ పెద్దలకే తెలియాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో రోడ్డు విస్తరణ ముందుకు కదలడం లేదు. కేంద్ర సర్కారు నిర్లక్ష్య ధోరణిపై వాహనదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హైదరాబాద్ – భైంసా మార్గంలో రాష్ట్ర రాజధాని నుంచి మెదక్ వరకు 80 కిలో మీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ మీదుగా భైంసా వరకు 145 కిలో మీటర్ల మే ర విస్తరణను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పట్టించుకోవడం లేదు. ఏండ్లుగా కాలయాపనే తప్ప ఎక్కడా పని కొనసాగడం లేదు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గ కేంద్రాల మీదుగా భైంసా వరకు జాతీయ రహదారి పూర్తయితే, ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.
కేకేవై సంగతేంది..?
మూడు జిల్లాలను అనుసంధానం చేస్తూ కరీంనగర్ నుంచి కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డి వరకు కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి (కేకేవై) జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేస్తామంటూ మొదట్లో భారీగా ప్రకటనలు సైతం ఇచ్చారు. కానీ, ఇంత వరకు ఆ ప్రాజెక్టు ‘రోడ్డెక్కలేదు’. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం మాటిచ్చింది. ఇప్పటికీ నేతల మాటలు, అధికారుల ప్రణాళిక కొలిక్కి రాలేదు. కరీంనగర్ నుంచి ఎల్లారెడ్డి చౌరస్తా వరకు 138.38 కిలో మీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా మార్చుతున్నట్లుగా కేంద్రం ప్రకటించి ఆరేండ్లు దాటింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇరు జిల్లాలకు వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయి. రవాణా సౌకర్యం అద్భుతంగా మారుతుంది.
ఎన్హెచ్ 63పైనా నిర్లక్ష్యమే..
నిజామాబాద్ నుంచి చత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు ఉన్న 63వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసింది. జాతీయ రహదారుల అథారిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ శివారు నుంచి ఆర్మూర్ వరకు 19 కిలో మీటర్ల మేర రహదారి విస్తరణకు నిధులు మంజూరు కాగా, దాదాపు నాలుగున్నరేండ్ల కాంట్రాక్టుపై ఏజెన్సీ వారు పనులు చేపట్టారు. కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులు మొదట్లో పనులు వేగంగా చేశారు. రహదారులకు ఇరువైపులా ముళ్లపొదలు, చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించారు. రోడ్ల వెడల్పు కోసం అవసరమైన స్థలాన్ని చదును చేయించారు. ఇరువైపులా తవ్వి, కింద నుంచి కంకర వేసి పటిష్టం చేశారు. తర్వాత తారు వేశారు. మొత్తం 19 కిలో మీటర్లకు గాను 14.377 కిలో మీటర్ల మేర రహదారి విస్తరణ పూర్తి చేశారు. మరో 4.633 కిలో మీటర్ల మేర పనులు వివిధ కారణాలతో అర్ధంతరంగా నిలిచి పోయాయి. సాఫీగా జరగాల్సిన జాతీయ రహదారి 63 ప్రయాణం కాస్తా మార్గమధ్యలో భయాందోళనకు గురి చేస్తోంది. భారీ గుంతలతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఏండ్లుగా ఈ ప్రాంత రహదారిపై కేంద్రంలోని ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండడమే తప్ప పట్టించుకున్నది లేదు.