సదాశివనగర్, నవంబర్ 8: నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అనేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వైద్యశాఖను తీర్చిదిద్దారు. రోగులకు కావాల్సిన మందులు, వైద్యులను నియమించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా 104 అంబులెన్సుల ద్వారా గ్రామాల వారీగా పర్యటించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేసేలా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు. ఇవన్నీ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ పీహెచ్‌సీకి పట్టనట్లు ఉన్నాయి. రోగుల పట్ల ఇక్కడి వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు వైద్యుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. రోగులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం జ్వరంతో బాధపడుతున్న రోగులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన షుగర్ వ్యాధిగ్రస్తులు మందుల కోసం ఉత్తునూర్ పీహెచ్‌సీకి వచ్చారు. పది గంటలు దాటినా వైద్య సిబ్బంది గేటుకు వేసిన తాళం తీయకపోవడంతో గేటు ఎదుటే రోడ్డుపై పడుకున్నారు.
మరికొంత మంది రోగులు చెట్టు కింద, కల్వర్టులపై కూర్చున్నారు. చలికి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ గేటు ఎదుట పడి ఉన్నా వైద్యుడు కానీ, వైద్య సిబ్బంది కానీ విధులకు రాకపోవడంతో రోగుల కుటుంబీకులు ఉత్తునూర్కు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేటు మెడికల్‌లో మందులు కొనుగోలు చేసి వారిని ఇంటికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి దవాఖానలు ఏర్పాటు చేసి వైద్యులను నియమిస్తే.. సేవలందించాల్సిన వైద్యుడు పీహెచ్‌సీకి తాళం వేయించి ఇంటి వద్దే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి..
షుగర్ మందుల కోసం ఉదయం 8 గంటలకు దవాఖానకు వచ్చిన. గేటుకు తాళం ఉండడంతో రెండు గంటల పాటు గేటు ఎదుటే నిలబడి రోడ్డుపై కూర్చున్న. అయినా వైద్య సిబ్బంది దవాఖానకు రాలేదు. కిలోమీటర్ దూరంలో ఉన్న ఉత్తునూర్ వెళ్లి ప్రైవేటు మెడికల్‌లో షుగర్‌కు మందులు తీసుకున్నాను. షుగర్ వ్యాధి ఉన్న వారికి ప్రభుత్వం ప్రతినెలా మందులు సరఫరా చేస్తున్నా.. ఉత్తునూర్ దవాఖానలో డాక్టర్ లేకపోవడంతో పానం గాబరా అయ్యింది. ఆఫీసర్లు పట్టించుకొని మాలాంటి రోగులకు మంచి వైద్యం అందించే సిబ్బందిని నియమించాలని కోరుతున్నాం.
– గాంధారి మల్లయ్య, షుగర్ వ్యాధిగ్రస్తుడు, వజ్జపల్లి
డాక్టర్ టైంకు రావట్లేదు..
ఉత్తునూర్కు చెందిన తూర్పు మోహన్ రావు జ్వరం రావడంతో దవాఖానకు ఉదయం 8గంటలకు వచ్చాడు. గేటుకు తాళం ఉండడంతో రోడ్డుపైనే పడుకున్నాడు. మందుల కోసం ఈ దవాఖానకు ఉత్తునూర్, వజ్జపల్లి, యాచారం, బూర్గుల్, దగ్గి, తిమ్మోజివాడి, వజ్జపల్లి తండాల నుంచి రోజూ వందలాది మంది వస్తారు. డాక్టర్లు టైంకు వచ్చి రోగులను చూసి మందులిస్తే.. వాళ్లు ప్రైవేటుకు ఎందుకు వెళ్తారు. సర్కార్ ఉచితంగా మందులు పంపిస్తే.. ఇక్కడ ఉన్న డాక్టర్, సిబ్బంది టైంకు రాకపోవడంతో ప్రైవేటు మెడికల్‌కు వెళ్లి డబ్బులు ఇచ్చి మందులు కొనుక్కుంటున్నారు.
– కమ్మరి కిష్టయ్య, ఉత్తునూర్