ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ గ్రామం అన్ని మౌలిక వసతులను సమకూర్చుకున్నది. రెండున్నరేండ్లలోనే ఆ పల్లెలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామం నేడు జోర్దార్గా మారింది.
ప్రభుత్వ కార్యక్రమాలను యాద్గార్పూర్ వాసులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారు. పల్లె ప్రగతి, హరితహారం, మిషన్ భగీరథ పథకాలతో స్థానిక సమస్యలన్నీ పరిష్కరించుకున్నారు. రెండున్నరేండ్లలోనే మౌలిక వసతులను సమకూర్చుకున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నేడు ప్రతి గడపకూ శుద్ధజలం అందుతున్నది. వైకుంఠథామం, కంపోస్ట్ షెడ్డు అందుబాటులోకి వచ్చాయి. నివాసాల నుంచి ప్రతిరోజూ ఉదయం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్ట్ షెడ్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
ఈ ఎరువును అవసరమైన రైతులకు విక్రయించి గ్రామానికి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. లేదంటే హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు వినియోగిస్తూ పచ్చదనాన్ని మరింత పెంపొదిస్తున్నారు. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. పల్లె ప్రగతిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను తొలగించారు. పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రతిరోజూ మురికి కాల్వలను శుభ్రం చేస్తున్నారు. రోడ్లు, వీధుల్లో వ్యర్థాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా రసాయనాలను పిచికారీ చేస్తున్నారు.
మునుపెన్నడూ చూడని అభివృద్ధి
యాద్గార్పూర్ గ్రామంలో 1022 మంది నివసిస్తుండగా, మునుపెన్నడూ చూడని అభివృద్ధి జరిగింది. రూ.12.60 లక్షలతో వైకుంఠథామం, రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మించడంతోపాటు రూ.3.28 లక్షలతో పల్లెప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. ఏటా వానకాంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కోసం గ్రామ నర్సరీని ఏర్పాటుచేసి 1600 మొక్కలు పెంచుతున్నారు. 20 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో రెండు వేల మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దారు. మొక్కలకు ప్రతిరోజూ నీరందించేందుకు రూ.లక్షా 65వేలతో వాటర్ ట్యాంకర్ను సమకూర్చుకున్నారు. గ్రామంలో ఉన్న చెత్త సేకరణకు రూ. 7.50 లక్షలతో ట్రాక్టర్, రూ.1.80 లక్షలతో ట్రాలీని కొనుగోలు చేశారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా 800 వందల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు నిర్మించడంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో స్థానికుల ప్రధాన సమస్యలన్నీ దూరమయ్యాయి.
ఉత్తమ పంచాయతీగా ఎంపిక..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. మౌలిక వసతులు కల్పించారు. స్వచ్ఛ పల్లెగా తీర్చిదిద్దారు. దీంతో యాద్గార్పూర్ గ్రామంలో 2020లో జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ప్రస్తుతం జాతీయ స్థాయి అవార్డు కోసం కూడా పోటీలో ఉన్నారు. ఇందుకోసం కేంద్రం సూచించిన అంశాలను ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు.
పల్లెప్రగతి, హరితహారంతో కొత్తకళ..
అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు, వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలతో గ్రామానికి కొత్తకళ వచ్చింది. అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాం. జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకునేందుకు కృషిచేస్తున్నాం.
-మిర్జాపూర్ విజయా చిన్నసాయన్న ,సర్పంచ్, యాద్గార్పూర్
ప్రజల భాగస్వామ్యం సంతోషకరం..
గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిచడంలో ముందువరుసలో ఉన్నాం. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇంటింటికీ చెత్తబుట్టలను అందించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాం.
– సునంద, పంచాయతీ కార్యదర్శి, యాద్గార్పూర్