నిజామాబాద్, మార్చి 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా రైతుల అమాయకత్వాన్ని కొంత మంది విత్తన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అంటగట్టి తమ పబ్బం గడుపుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీగాళ్ల చేతికి రైతులు చిక్కి విలవిల్లాడుతున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో వెలు గు చూసింది. బాల్కొండ మండలంలోని ఇత్వార్పేట్కు చెందిన కొంతమంది రైతులు యాసంగికి ముందు ఎర్రజొన్న విత్తనాలను ఆర్మూర్‌లోని సత్యసాయి సీడ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. చేతికి అందిన విత్తనాలను సాగు పద్ధతుల్లో సక్రమంగానే విత్తుకున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఎర్రజొన్న చేతికొచ్చినప్పటికీ ఎలాంటి దిగుబడి కనిపించడం లేదు. ఇదేమిటని రైతులంతా ఆశ్చర్యపోయారు. విత్తనాలను విక్రయించిన బీజేపీ నేత భాస్కర్‌ను ఆర్మూర్‌లో పట్టుకుని నిలదీశారు. సమాధానం చెప్పాలంటూ నిలదీయగా డొంక తిరుగుడు జవాబులతో తప్పించుకున్నాడు. పైగా రైతులనే దబాయించే ప్రయత్నం చేయగా చేసేది లేక బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వ్యాపారి కారును పోలీసులు సీజ్ చేశారు.
ఇదీ అసలు కథ…
ఆర్మూర్ పట్టణానికి చెందిన విత్తన వ్యాపారి వై.భాస్కర్ నాసిరకం విత్తనాలతో రైతులను మో సం చేసిన సంఘటన సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. బాధిత రైతులు బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కొండ మండలం ఇత్వార్పేట గ్రామానికి చెందిన రైతులు కొంతమంది భాస్కర్ వద్ద జొన్న విత్తనాలను కొనుగోలు చేశారు. గతేడాది కూడా ఇదే గ్రామానికి సమీపంలోని పలువురు రైతులు ఇదే విధంగా మోసపో యారు. సమాచారం బయటికి రాకుండా విత్తన కేటుగాళ్లు లోలోపల మేనేజ్ చేసుకున్నారు. తిరిగి తాజాగా ఎర్రజొన్న నకిలీ విత్తన ఘటన మరోమారు వెలుగు చూడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి కనీసం 25 క్వింటాళ్లు మేర దిగుబడి వస్తుందనుకుంటే కేవలం 3 క్వింటాళ్లు కూడా పంట చేతికి రాకపోవడం ఏమిటని రైతులు వాపోతున్నారు. కనీసం ఖర్చు చేసిన పెట్టుబడి కూడా చేతికి అందే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించినా కష్టమంతా నకిలీ విత్తనాల ద్వారా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరారీలో విత్తన వ్యాపారి…
బాల్కొండ మండలం ఇత్వార్పేట గ్రామానికి చెం దిన మొత్తం ఐదుగురు రైతులు ఆర్మూర్‌కు చెందిన విత్తన వ్యాపారి భాస్కర్ చేతిలో అడ్డంగా మోసపోయారు. దిగుబడి రాకపోవడంతో లబోదిబోమంటున్న కర్షకులంతా న్యాయం కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. మార్చి 24న బాల్కొండ పోలీస్ స్టేషన్లో రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేశారు. ఠాణాలో కేసు నమోదు కావడంతోనే సమాచారం అందుకున్న విత్తన వ్యాపారి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రైతులను మోసం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. నాలుగు బృందాలను ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నకిలీ విత్తనాల బెడద తీవ్రంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమార్కుల్లో దడ పుడుతున్నది. అక్కడక్కడా కొంత మంది కేటుగాళ్లు దొడ్డిదారుల్లో నకిలీ విత్తనాలను సృష్టించి అమాయక రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తన విక్రయాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలతో పాటు జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నకిలీ విత్తనాలు విక్రయాలు జరుగకుండా ఉండేందుకు అధికారులు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు.
పీడీ యాక్టు అమలుకు యోచన…
ప్రభుత్వ యంత్రాంగానికి నకిలీ విత్తనాలపై సీఎం కేసీఆర్ గతంలో కఠినమైన ఆదేశాలను జారీ చేశా రు. రైతులను మోసం చేసే వ్యక్తులు ఎంతటి వారై నా సరే కూకటి వేళ్లతో పెకిలించాలని చెప్పారు. వ్య వసాయ, పోలీస్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉంటూ కేటుగాళ్ల పని పట్టాలని చెప్పారు. అవసరమైతే అక్రమార్కులపై పీడీ యాక్టు నమోదు చేసి కటకటాలకు పంపాలని సీఎం ఇదివరకే అధికార యంత్రాంగానికి దిశానిర్దేశనం చేశారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో బాల్కొండలో నమోదైన కేసులో నిందితుడిపై తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎర్రజొన్న విషయంలో దశాబ్ద కాలం క్రితం ఘోరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఈ విషయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చొరవ తీసుకుని సీఎం కేసీఆర్‌తో కోట్ల రూపాయలను మంజూరు చేయించి రైతులను ఆదుకున్నారు. తిరిగి ఎర్రజొన్న విషయంలో నకిలీలు వెలుగు చూడడంతో ప్రభుత్వం సీరియస్‌గానే స్పందించే ఆస్కారం ఉంది. కల్తీ విత్తనాల తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో అవసరమైతే పీడీ చట్టం కింద అరెస్టు చేసేందుకు యం త్రాంగం భావిస్తున్నట్లుగా తెలిసింది.
నిందితుడి కోసం గాలిస్తున్నాం
నకిలీ విత్తనాల ద్వారా ఇత్వార్పేటకు చెందిన ఐ దుగురు రైతులు మోసపోయినట్లు మాకు ఫిర్యా దు ఇచ్చారు. భాస్కర్ అనే విత్తన వ్యాపారి మూ లంగా తీవ్రంగా నష్టాలు సంభవించాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయం చే యాలని వారు కోరారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం విత్తన వ్యాపారి పరారీలో ఉన్నాడు.
– చంద్రమోహన్, బాల్కొండ ఎస్సై