బాన్సువాడ టౌన్, అక్టోబర్ 30: దేశంలోనే మరెక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులను సంక్షేమానికి వెచ్చిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన 18 మంది డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ. 45 లక్షలను పట్టణంలోని తన స్వగృహంలో ఆదివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు వరకు సర్వే పూర్తిచేసిన ఇండ్లకు బిల్లులను చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అందిన డబ్బుతో మిగితా నిర్మాణ పనులను పూర్తిచేసుకుంటే మళ్లీ బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. ఇందులో అవకతవకలకు తావులేకుండా స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లతోపాటు రైతులు, వివిధ వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.
సొంతిల్లు ఉన్న అబ్బాయిలకే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లను ఇచ్చి పెండ్లి చేస్తున్నారని స్పీకర్ అన్నారు. లేదంటే నిరాకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గుర్తుచేశారు. ఇక మీదట ఇలాంటి సమస్య ఎవరికీ రాకూడదని, నియోజకవర్గం పరిధిలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ సొంతింటి కలను నెరవేస్తామని అన్నారు. త్వరలో రూ. 3 లక్షలతో ఇల్లు నిర్మించుకునే పథకం రానున్నదని తెలిపారు. కాంట్రాక్టర్, అగ్రిమెంట్‌తో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకే డబ్బు చేరుతుందని వివరించారు. అర్హత ఉన్నవారికి ఈ పథకాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం లబ్ధిదారులు స్పీకర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో బీర్కూర్ మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, వీరాపూర్ సర్పంచ్ సాయిలు, ఎంపీటీసీ గంగారాం, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)నాయకులు లాడేగాం గంగాధర్, స్పీకర్ వ్యక్తిగత సహాయకుడు భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.