ఆర్మూర్, మార్చి 25: రైతులు భూసార పరీక్షలు చేసుకొని.. వాటి ఆధారంగా పంటల సాగు కోసం బయో ఎరువులను తయారు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ అన్నారు. మండల వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ విధానంపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఇస్సాపల్లి గ్రామంలోని ఎల్ఎన్ఆర్ బయోటెక్ ప్లాంట్‌లో వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి రైతూ వారి వ్యవసాయ భూముల్లో కొంత భాగంలో సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగించుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. చీడ, పీడల నివారణకు క్రిమిసంహారక మందులకు బదులుగా వేప నూనెను వాడాలని తెలిపారు. అనంతరం ఆలూర్ రైతువేదిక భవనంలో సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ పొందిన రైతులందరికీ సర్టిఫికెట్లను జిల్లా వ్యవసాయాధికారి అందించారు. ఆర్మూర్ ఏడీఏ ఎ.విజయలక్ష్మి, ఏవో హరికృష్ణ, ఆలూర్ సొసైటీ చైర్మన్ కల్లెం భోజారెడ్డి, ఎల్ఎన్ఆర్ బయోటెక్ బాధ్యుడు ఉమ్మడి రాజారెడ్డి, ఏఈవోలు, ఆత్మ అధికారులు, రైతులు పాల్గొన్నారు.