కామారెడ్డి రూరల్, అక్టోబర్ 30: ప్రస్తుతం వాతావరణ సమస్యలతోపాటు ప్రకృతి వైపరిత్యాలతో ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నది. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గర్భిణులు, వ్యాధిగ్రస్తులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. కొవిడ్ సమయంలో జిల్లాలో అత్యధికంగా టీకాలు వేయించడంతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారు.
అయోడైజ్డ్ ఉప్పుతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు చురుకుదనం, జ్ఞాపక శక్తి పెరుగుదల, గర్భస్థ శిశివు పెరుగుదల ఉంటాయి. సరైన ఉప్పు వాడకపోవడంతో మృత శిశువు జననం, గొంతువాపు, అతి తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, మరుగుజ్జుతనం, చెవిటి, మూగ తనం, బుద్ది మాంద్యం, చదువులో వయస్సుకు తగ్గ ప్రతిభ చూపకపోవడం మొదలగు సమస్యలు తలెత్తుతాయి. వంటల్లో చివరిగా మాత్రమే ఉప్పును వేయడంతో పాటు ఉప్పు వాడకం అనంతరం గాలి చొరబడకుండా డబ్బాకు మూతలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి విషయాలను ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
ఆయా గ్రామాల వారీగా ఆరోగ్య కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామసభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలను వివరిస్తున్నారు. ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులకు టీకాలు వేయడంతో పాటుగా గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు చేయడం, వ్యాయామం ఆవశ్యకతను వివరిస్తున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని కస్తూర్బా బాలికల పాఠశాల, మైనార్టీ హాస్టల్లో వారానికి ఒక సారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. వారికి అవసరమైన వైద్య సదుపాయాలను సమకూరుస్తున్నారు.
వివాహం చేసుకున్న జంటలు బిడ్డకు, బిడ్డకు మధ్య కొద్ది సంవత్సరాల తాత్కాలిక వ్యవధి కోసం హానికరమైన మందులు వాడుతుంటారు. అలా వాడకుండా తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి(కాపర్) వివరాలను దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవ లు, సదుపాయాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే వైద్య సేవలు పొందాలి. వైద్య సదుపాయాలపై క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలతో అవగాహన కల్పిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ లాంటి వాటికి పేషెంట్లకు మందులు పంపిణీ చేస్తున్నాం.
– సుస్మితారాయ్, మెడికల్ ఆఫీసర్