ఇందూరు, అక్టోబర్ 29 : గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. తమ విధులు, బాధ్యతలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకొని లక్ష్యాల సాధనకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈసీలతో శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోజూవారీ సాధారణ విధులతోపాటు హరితహారం, ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించడం, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, పల్లెప్రకృతివనాలు, బృహత్, మినీ బృహత్ ప్రకృతివనాలు, హరితవనాలు, నర్సరీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా ప్రతి మూడు మీటర్లకు కనీసం ఆరు అడుగుల ఎత్తు కలిగిన మొక్క తప్పనిసరిగా ఉండాలని, మొక్కల నిర్వహణ, సంరక్షణ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్డు, నర్సరీల్లో ప్రణాళికాబద్ధంగా మొక్కలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎకరం విస్తీర్ణంలో నాలుగు వేల చొప్పున మొక్కలు ఉండాలని, వీటి నిర్వహణ కోసం ప్రతి నాలుగు వందల మొక్కలకు ఒక వన సేవకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కనీసం అర ఎకరం స్థలాన్ని గుర్తిస్తూ నవంబర్ 15లోగా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలని గడువు విధించారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఫార్మేషన్ రోడ్లు, కచ్చా డ్రైవ్లు వంటి పనులను ఇదివరకే అధికారులు గుర్తించారని, ఉపాధిహామీ కూలీలకు పనికల్పించి డిసెంబర్ పూర్తిలోగా పనులు పూర్తిచేసేలా ఫీల్డ్ అసిస్టెంట్లు చొరవ చూపాలన్నారు. వచ్చే హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, డిసెంబర్ 15 నాటికి ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో కనీసం 10 వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో చందర్, ఏపీడీ సంజీవ్ పాల్గొన్నారు.